ఒలింపిక్స్ లో పురుషుల హాకీ విభాగంలో తప్పనిసరిగా పతకం సాధిస్తామని భారత హాకీ జట్టు ఆటగాడు యువరాజ్ వాల్మీకి ధీమా వ్యక్తం చేశాడు. శ్రీజేష్, మన్ ప్రీత్ ల నాయకత్వంలో జట్టు అద్భుతంగా రానిస్తోందని, ఇటీవలి కాలంలో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్నామని వివరించాడు. అయితే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అని దానిపై కాస్త సందేహం వ్యక్తం చేసిన వాల్మీకి జరిగితే మాత్రం మనకు పతకం ఖాయంగా వస్తుందని స్పష్టం చేశారు.
విశ్వ క్రీడా సంబరాల్లో పతకం సాధిస్తే అది దేశానికే గర్వకారణంగా ఉంటుందని, మరోవైపు ఆటగాళ్లకు కూడా మంచి గుర్తింపు వస్తుందని చెప్పాడు. ఇటీవలి కాలంలో క్రీడాభిమానుల దృష్టి మొత్తం క్రికెట్ వైపే ఉందని, ఒలింపిక్స్ పతకం సాధిస్తే క్రీడతో పాటు ఆటగాళ్లకు కూడా గౌరవం పెరుగుతుందని వివరించాడు.
కేవలం తన ఫోటో పేపర్లలో చూసుకోవడానికే హాకీ ఆడాలని అనకున్నానని వివరిస్తూ ముంబైలో కనీసం విద్యుత్ వసతి కూడా లేని చిన్న గదిలో ఉంటూ ఆటపై అభిమానంతోనే కష్తపది ఈ స్థాయికి చేరుకున్నానని వాల్మీకి చెప్పాడు. భారత జట్టులో ఆడడం, గుండె మీద ఇండియన్ బ్యాడ్జి ధరించడం ప్రతి ఒక్క క్రీడాకారుడికీ ఎంతో స్ఫూర్తి నిచ్చే విషయమన్నాడు.
2011 ఆసియన్ ఛాంపియన్ షిప్ లో భారత హాకీ జట్టుకు ఆడిన వాల్మీకి ఫైనల్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా స్టార్ గా ఎదిగాడు. ఈ మ్యాచ్ ఎప్పటికీ తనకు గుర్తుండి పోతుందని, భారత త్రివర్ణ పతాకం పైకి ఎగురుతూ పాకిస్తాన్ పతాకం కిందకు దిగుతుంటే దేశం కోసం ఏదో చేశానన్న భావన ఎంతో మధురానుభూతిని కలిగించిందని చెప్పాడు. ఇప్పటివరకూ 52 మ్యాచ్ లు ఆడిన యువరాజ్ 14 గోల్స్ సాధించాదు. ఒలింపిక్స్ లో సత్తా చాటి మరోసారి దేశాన్ని విజేతగా నిలపాలని ఆశిద్దాం.