దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా వస్తుందంటే తప్పకుండా అందులో కంటెంట్ ఉంటుందనే ఒక నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అందువలన ఆ సినిమా వైపు ఒక లుక్ వేస్తారు. దిల్ రాజు కొత్త హీరోలను .. హీరోయిన్లను మాత్రమే కాదు, దర్శకులను కూడా పరిచయం చేశాడు. అలా ఆయన పరిచయం చేసిన పదో దర్శకుడే వేణు. దిల్ రాజు బ్యానర్లో దర్శకుడిగా ఛాన్స్ సంపాదించుకోవడం అంత తేలికైన పనేం కాదు. అలాంటి సాహసాన్ని వేణు సాధ్యం చేశాడు. తనలోని దర్శకుడిని తొలిసారి బయటికి తీశాడు.
అంతగా ‘బలగం‘ సినిమాలో ఏవుందని వెళితే .. బలమైన ఎమోషన్స్ .. అప్పుడప్పుడు హాయిగా నవ్వుకునే కామెడీ కనిపిస్తాయి. వేణులో ఇంత మాంచి దర్శకుడు ఉన్నాడా అనిపిస్తుంది. అందరికీ తెలిసిన కథనే అయినా .. తనదైన స్టైల్లో ఎంతో చక్కగా ఆవిష్కరించాడు అనిపిస్తుంది. ఇక కథ మొత్తాన్ని కలిపి ఉంచిన సందేశం కూడా కాస్త బలంగానే ఉంటుంది. భవిష్యత్తులో ఇతర నిర్మాతలు వేణుకి ఛాన్స్ ఇవ్వడానికి ఒక సర్టిఫికేట్ మాదిరిగా ఈ సినిమా ఉపయోగపడుతుంది.
‘సిరిసిల్ల’లో అనే గ్రామంలో కొమరయ్య అనే ఒక రైతు మరణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మరణానికి కుటుంబ సభ్యులంతా హాజరు కావడం .. ఎవరి స్వార్థానికి వారు ఆలోచించడం .. ఇగో ఫీలింగ్స్ .. ఊళ్లోవారి ధోరణి .. డబ్బు చుట్టూ తిరిగే బంధాలు .. ఇలా మొదటి నుంచి చివరి వరకూ కథా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ కథను మరింత బలంగా ముందుకు తీసుకు వెళాతాయి. తెలంగాణ జీవనచిత్రణ .. సంస్కృతి .. సందేశం కథలో కలిసిపోయి కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలలో, సహజత్వానికి దగ్గరగా నడిచిన ఈ కథకి ఎక్కువ మార్కులే ఇవ్వొచ్చు.