రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి చేయూతనిస్తున్నామని స్పష్టం చేశారు. రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో 9 లక్షల 12 వేల చేపపిల్లలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపితో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకూ పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. మైలారం పోతే మంచి చేపలు దొరుకుతాయి అనే పేరు తీసుకురావాలి. మంచి స్థలం చూసి హోల్ సెల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందు కోసం ఓ బిల్డింగ్ కూడా కట్టిస్తానని, కోల్డ్ స్టోరేజ్ కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకార్మికులు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తప్పకుండా తోడ్పాటును అందిస్తుందన్నారు. మహిళా మత్స్య కార్మికులు ఇంకా అవగాహనా పెంచుకొని మార్కెటింగ్‌లో నైపుణ్యం సంపాదించాలన్నారు. మైలారంలో మహిళలకు ప్రత్యేక షాప్ కేటాస్తానని దయాకర్ రావు చెప్పారు.