రాష్ట్ర ప్రభుత్వ వికేంద్రీకరణ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖపట్నంలో ఈనెల 15న నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర గర్జన నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ గర్జనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని తెలియజెప్పాలని పట్టుదలగా ఉన్నారు. ఈ గర్జనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
‘దేనికి గర్జనలు’ అనే శీర్షికతో పవన్ ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నారు?
- విశాఖపట్నంలో రుషికొండ అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?
- ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?
- మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?
- రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?
- అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా?
- ఫీజు రీ ఎంబర్స్మెంట్ చేయనందుకా? విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి.. నిధులు ఇవ్వనందుకా
- ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్ల ఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా?
- విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసినందుకా? ప్రజలు కోరిన మీదటే ఛార్జీలు పెంచామని చెప్పుకొన్నందుకా?
- కాలుష్యకారక పరిశ్రమలు బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ముద్దులుపెట్టి… ఇప్పుడు ఆ పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేస్తున్నందుకా?
- శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేసి అక్రమ రవాణా చేస్తున్నందుకా? మడ అడవులు ధ్వంసం చేసేస్తున్నందుకా?
- గ్రామ పంచాయతీల నిధులు మళ్లించేసినందుకా? మా పంచాయతీ నిధులు మాకు ఇవ్వండి అని అడిగిన సర్పంచులను అరెస్టులు చేస్తున్నందుకా?
- వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకా?
- భర్తీ చేస్తామన్న 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా? పోలీసు రిక్రూట్మెంట్ చేయనందుకా? డిఎస్సీ ఊసు వదిలేసినందుకా?
- స్కూల్స్, ప్రభుత్వ భవనాల నుంచి ఆలయ విద్యుత్ అలంకరణ వరకూ పార్టీ రంగులు వేసుకొంటున్నందుకా? హైకోర్టుతో చీవాట్లు తిన్నందుకా?
- ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా? పాలన వైఫల్యాలు దాచుకొనేందుకు కులాల మధ్య చిచ్చు రేపినందుకా?
- కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా?
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా?
- కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?
- ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా?
- 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?
- ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?
అంటూ వరుస ట్వీట్ లు చేశారు.
Aslo Read : ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం