వందేభారత్ అధికారిక ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధాని మోదీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ నెల 19న ప్రధాని కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం పర్యటన సమయంలో నిర్ణయం జరిగింది.
గత నెలలోనే ప్రధాని వందేభారత్ ను ప్రారంభిస్తారని భావించారు. ఇప్పుడు ఇందుకు ముహూర్తం ఖరారైంది. వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా సికింద్రబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి.
సికింద్రాబాద్ – విజయవాడ 4 గంటల్లోనే
ప్రధాని ప్రారంభించనున్న వందేభారత్ ద్వారా ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గిపోనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం నాలుగు గంటలుగా ఉండే అవకాశం ఉంది. వందేభారత్ ప్రయాణ వేళలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటక రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు పలు రైళ్లు నడుస్తున్నాయి. రెండు మార్గాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. రద్దీ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ మీదుగా విజయవాడ చేరకొని అక్కడ నుంచి గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. ఇప్పుడు వందలాది రైళ్లకు విజయవాడ జంక్షన్ గా ఉంటోంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మద్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగ సామర్ధ్యం గంటకు 130 కిలో మీటర్లుగా ఉంది. ఉదయం సమయంలోనే ఈ రైలును నడిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
విశాఖ వరకు త్వరలో పొడిగింపు..
సికింద్రాబాద్ – విజయవాడ మధ్య ప్రారంభం కానున్న రైలును విశాఖ వరకు పొడిగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ కేటాయింపు సమయంలోనే విశాఖ వరకు దీనిని కొనసాగించాలని ముందు ప్రతిపాదించారు. అయితే, ట్రాక్ సామర్ధ్యం.. ఇప్పటికే కొనసాగుతున్న రైళ్లు.. రద్దీని పరిగణలోకి తీసుకొని ముందుగా విజయవాడ వరకు నడపాలని డిసైడ్ అయ్యారు.
వచ్చే ఏప్రిల్ నుంచి వందేభారత్ ను సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటికే జన్మభూమి లో సిట్టింగ్ కోచ్ లతోనే సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు నడుపుతున్నారు. వందేభారత్ ను అందుబాటులోకి తేవటం ద్వారా ఇదే మార్గంలో త్వరిత గతిన మరింత సౌకర్యవంతంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు ప్రయాణం అందుబాటులోకి రానుంది.