అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో తనిఖీలు ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతలపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. జాతీయ మెడికల్ కమీషన్‌కు విరుద్ధంగా అక్రమరీతిలో వెల్స్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు 2020లో అనుమతి ఇచ్చిన కేసులో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నాయి. అనుమతి విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెన్నై, సేలమ్, మధురై, తేని, తిరువల్లూరు పట్టణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ మంత్రి విజయభాస్కర్‌పై గత ఏడాది అక్టోబర్‌లో డీవీఏసీ సోదాలు చేసింది.
కోయంబత్తూరులోని మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లోనూ ఇవాళ విజిలెన్స్ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో మాజీ మంత్రిగా చేశారాయన. వీధి దీపాల టెండర్ల విషయంలో మంత్రి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సన్నిహితులకు మాత్రమే ఆయన టెండర్లు ఇప్పించినట్లు విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి వేలుమణి ఇంటిపై దాడులు చేయడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి. వేలుమణికి సంఘీభావం తెలిపేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం ఆయన ఇంటి ముందు ప్రదర్శన చేపట్టారు. ఏడు మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు.
Also Read : హేమంత్ సోరెన్ పై ఈడీ దాడులు