111 canceled with 69 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జీవో నెంబర్ 111 ను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 111 ను రద్దు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జీవో 111 అమల్లో ఉన్న గ్రామాల్లో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. దీని కోసం రాష్ట్ర పురపాలక శాఖ జీవో నెంబర్ 69 ఉత్తర్వులను జారీ చేసింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించింది. రెండు జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే ఏడు మండలాలు 84 గ్రామాల్లో జీవో 111 నుంచి విముక్తి. కొత్త జీవో 69 విడుదల. లక్షకు పైగా ఎకరాల్లో నిర్మాణాలకు ఇంక ఇబ్బంది ఉండదు. జలాశయాల్లోకి నీరు వెళ్లేలా.. డైవర్షన్ ఛానళ్లను కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. దీని కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ కూడా వేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
మానవ నిర్మిత గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల ప్రాంతంలో సురానా సంస్థ ఒక పరిశ్రమ స్థాపించినప్పుడు అది రసాయన పరిశ్రమ అని చెరువులు కలుషితం అవుతాయి అని ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయస్థానం ఆశ్రయించినపుడు పరిశ్రమకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఆంక్షలు విధిస్తూ జీవో 111 పుట్టింది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఆ రెండు జలాశయాల పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా కఠిన ఆంక్షలు విధించే జీవో 111ను గతంలో పలుమార్లు ప్రభుత్వాలు ఆ జీవో ఎత్తేయాలి అడుగులు వేసినపుడల్లా అక్కడ భూముల కొనుగోలు జరిగింది. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో న్యాయ చిక్కులు వస్తాయి అని వెనకడుగు. ఇపుడు జీవో రద్దు. ఆంక్షలు సడలిస్తూ జీవో 69 జారీతో రియల్ రంగానికి ఉపు.. పర్యావరణ ప్రేమికులకు చికాకు.
ఇదిలా ఉండగా.. గతంలో జీవో నెంబర్ 111 ను రద్దు చేయాలని ప్రజల పేరుతో కొందరు బడా నేతలు, రియల్ దందా చేసే వాళ్ళు సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. జంట జలాశయాల పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటు ప్రతిపక్ష నేతలకు, బడా పారిశ్రామిక వేత్తలకు, సిని రంగానికి చెందిన వారికి ఫాం హౌస్ లు ఉన్నాయి. బడా బాబులకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలన కన్నా ఎక్కువ విధ్వంసం జరుగుతోందనే వాదనలు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో 111 జివో రద్దు తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో కుండపోత వర్షాలకు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుర్గం చెరువు సమీపంలో ఖరీదైన కాలనీలు ముంపు భారిన పడ్డాయి. పాతబస్తీ సమీపంలో బండ్లగూడ వద్ద రోజుల తరబడి ప్రజలు బురద నీటిలోనే గడిపారు. రామంతపూర్ చెరువు కబ్జాకు గురికావడంతో వర్షపు నీరు హబ్సిగుడా ప్రధాన రహదారిపైకి వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చినుకులు ఎక్కువ పడితే చాలు సరూర్ నగర్ చెరువు నిండిపోయి చెరువుకట్ట కింది కాలనీలు జలమయం అవుతాయి. చైతన్యపురి వద్ద విజయవాడ ప్రధాన రహదారిపై వర్షాలు తగ్గిన నాలుగు రోజుల వరద ఉదృతి కొనసాగుతుంది. పటాన్ చెరువు ప్రధాన రహదారి దగ్గర చెరువు కబ్జాతో ఇదే పరిస్థితి నెలకొంది. ఏకదాటి వర్షాలకు ట్యాంక్ బండ్ దిగువన అల్లకల్లోల పరిస్థితులు రేపడ్డాయి. ఇవన్నీ సిఎం కెసిఆర్ కు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ కు తెలియంది కాదు.
ప్రతిపక్షాలు వాటి నేతలు 111 జివో రద్దు మీద తూతూ మంత్రంగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలోకి రావాలనే యావ తప్పితే కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజల తరపున ఒక సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిలబడిన దాఖలాలు లేవు. కెసిఆర్ పాలన మీద విరక్తి పుట్టిన నాడు ప్రజలే తమను అధికార పీటం ఎక్కిస్తారని హస్తం, కమలం నేతలు ఉన్నారు. రెండుసార్లు గెలిచిన… తెరాస మూడోసారి గెలిచే అవకాశం లేదనే కాకి లెక్కలతో మొక్కుబడి పాదయాత్రలు, ధర్నాలతో ఎన్నికల కోసం కాపు కాస్తున్నారు.
వర్షం పడితే రాజ్ భవన్ , సిఎం క్యాంపు కార్యాలయం ముందే చెరువు మాదిరిగా తయారవుతునదని స్వయంగా ముఖ్యమంత్రే ఎన్నోసార్లు చెప్పారు. ఇంత తెలిసిన సిఎం కెసిఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకోవటం పర్యావరణ ప్రేమికుల్ని నిర్ఘాంత పరిచింది. తెలంగాణ భౌగోళిక స్వరూపం పూర్తిగా తెలిసి ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ 111 జివో రద్దు చేయటం అనేది తిన్నింటి వాసాలు లెక్క పెట్టె మాదిరిగా ఉంది.
111 జివో రద్దుతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు ఉరి తప్పదు. క్యాచ్ మెంట్ ఏరియాలో బహుళ అంతస్తుల భవనాలు వెలిస్తే వర్షపు నీరు దిగువకు రాలేక ఎటువైపు మళ్లుతుందో రాబోయే రోజుల్లో మనమే చూస్తాం.
:- దేశవేని భాస్కర్