మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరువైందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సావాంగ్ వెల్లడించారు. హింసావాదం, రక్తపాతంతో అభివృద్ధి జరగదన్న సత్యాన్న గిరిజనులు గ్రహించారని, అందుకే వారు మావోయిస్టుల అభిప్రాయాలతో విభేదిస్తున్నారని చెప్పారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ (ఏవోబి) లో పనిచేస్తున్న ఆరుగురు మావోయిస్టులు ఏపీ పోలీసులకు లొంగిపోయారు. అమరావతిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డిజిపి సమక్షంలో వారిని మీడియా హాజరు పరిచారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ సహా డివిజనల్ కమాండర్ స్థాయి నేతలు, అగ్రనేత ఆర్కే గన్ మెన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ స్థానిక సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని, పోలీసులపై కూడా గిరిజనుల అభిప్రాయంలో గతానికీ, ఇప్పటికీ ఎంతో తేడా వచ్చిందని వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం దాదాపు 20 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిందని, 3 లక్షల ఎకరాల భూమి పంచి ఇచ్చిందని, వారి అభివృద్ధిపై ప్రత్యెక దృష్టి సారించిందని అన్నారు. అందుకే మావోలు ఇప్పుడు కొత్తగా స్టీల్ ప్లాంట్ నినాదం ఎత్తుకున్నారని డిజిపి వెల్లడించారు.