Saturday, November 23, 2024
Homeతెలంగాణటెంపుల్ టౌన్ గా వేముల‌వాడ‌

టెంపుల్ టౌన్ గా వేముల‌వాడ‌

వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో వేముల‌వాడ‌ ఆలయ,ప‌ట్ట‌ణాభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు కేటీఆర్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి…. వీటీడీఏ, దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. వేముల‌వాడ ఆల‌య అభివృద్ధి పనుల పురోగతి, ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులపై మంత్రులు ఆరా తీశారు.

ఈ స‌మావేశంలో మంత్రులు మాట్లాడుతూ…. దేశం అబ్బుర‌ప‌డే విధంగా సీయం కేసీఆర్ యాదాద్రి ఆల‌యాన్ని పునఃనిర్మిస్తున్నార‌ని, వేముల‌వాడ ఆల‌యాన్ని ఆదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి, ప‌నులు ప్రారంభించుకున్నామ‌న్నారు. వీటీడీఏ, దేవాదాయ, పుర‌పాల‌క, రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్త‌ప‌తిల‌ను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాల‌ని సూచించారు. వేముల‌వాడ ఆల‌య అభివృద్ధితో పాటు స‌మాంత‌రంగా ప‌ట్ట‌ణాభివృద్ధి జ‌ర‌గాల‌ని, దానికి సంబంధించిన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకుని అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌న్నారు.

రాజన్న గుడితోపాటు, వేములవాడ పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. వేముల‌వాడ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌తో పాటు పుర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందించ‌డమే ల‌క్ష్యంగా అధికారులు ప‌ని చేయాల‌న్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, క‌ళ్యాణ‌క‌ట్ట‌, క‌ళ్యాణ మండ‌పం, క్యూ కాంప్లెక్స్, క‌ళా భ‌వ‌నం పనులను వేగవంతం చేయాల‌ని చెప్పారు. టెంపుల్ టూరిజంలో భాగంగా వేముల‌వాడ‌ను స‌మ‌గ్ర అభివృద్ధి చేయాల‌ని, గుడి చెరువు చుట్టు నెక్లెస్ రోడ్ నిర్మించాల‌ని, బోటింగ్ కు త‌గిన‌ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. వేముల‌వాడ‌, మిడ్ మానేరు లో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత మెరుగుప‌రిచేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. దీని వ‌ల్ల టెంపుల్ టూరిజం, టూరిజం రెండు అభివృద్ధి చెంద‌డం వ‌ల్ల స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు దొరుకుతాయ‌ని తెలిపారు.

బ‌ద్ధిపోచ‌మ్మ ఆల‌య విస్త‌ర‌ణ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని, దానికి సంబంధించిన స్థ‌ల సేక‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని, విస్త‌ర‌ణ‌లో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి త‌గిన న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు. వేముల‌వాడ‌లో ద‌శల వారీగా రోడ్ల విస్త‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని, బ్రిడ్జి నుంచి గుడి వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టాల‌న్నారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాసాల‌కు ఓర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వేముల‌వాడ‌కు సామాన్య భ‌క్తులు వ‌స్తార‌ని, బ‌స్టాండ్ నుంచి ఆల‌యం వ‌ర‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాల‌ని, దానికి అనుగుణంగా మినీ ఎల‌క్ట్రిక‌ల్ బస్సుల‌ను అందుబాటులోకి తెచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

వేముల‌వాడ ప‌ట్ట‌ణ స‌మ‌గ్ర అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్ని స‌హాయ సాకారాలు అందించాల‌ని పుర‌పాల‌క శాఖ అధికారుల‌కు సూచించారు. ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లను సానుకూలంగా ప‌రిశీలించాల‌ని పుర‌పాల‌క శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. అంత‌కుముందు మంత్రి కేటీఆర్ కు వేములవాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ప్ర‌సాదాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ అంద‌జేశారు.

ఈ స‌మావేశంలో వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, దేవాదాయ శాఖ కమిష‌న‌ర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, వీటీడీఏ వైస్ చైర్మ‌న్ పురుషోత్తం రెడ్డి, వేముల‌వాడ ఈవో క్రృష్ణ ప్ర‌సాద్, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ రామ‌తీర్థ‌పు మాధ‌వీ రాజు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్