తెలంగాణ రాష్ట్రంలో అలజడికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెర లేపారంటూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో జరిగిన వ్యవసాయ గోడౌన్, రైతు వేదికల ప్రారంభం తో పాటు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కుర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సహచర మంత్రి జగదీష్ రెడ్డి తో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన ఆదేశాల మేరకే రెండు (కాంగ్రెస్, బిజెపి) జాతీయ పార్టీలలో నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆయన అనుచరులు ఆయన ఆదేశాల మేరకే రెండు పార్టీలలో చేరారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో విపక్షాలు జరిపే యాత్రలకు జనామోదం లేదన్నారు.యావత్ తెలంగాణ సమాజం కలిసి జైత్రయాత్ర జరిపి తెలంగాణ సాదించుకున్నారన్నారు.ఇప్పటికి తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో సాగుతున్న జైత్రయాత్ర లోనే ఉన్నారన్నారు.
బిజెపి నేతలు, కాంగ్రెస్ నేతలు గల్లీలో కాదు ఢిల్లీలో వారి యాత్రలు జరపాలని మంత్రి సూచించారు. తెలంగాణకు ఇస్తామన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించాలన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలుకు యాత్రలు చెయ్యాలి
యాత్రలు జరిపే నేతలకు, ప్రజల ఆకాంక్షలు వాళ్లకు పట్టవని విమర్శించారు. విపక్షాల భాష నోటితో మాట్లాడేదే కాదన్నారు. రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే మోటర్లకు మీటర్లు ఖాయమన్నారు.