Saturday, November 23, 2024
HomeTrending Newsపాక్ చైనా మధ్య స్పర్ధలు

పాక్ చైనా మధ్య స్పర్ధలు

చైనా, పాకిస్తాన్ మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్ ప్రభుత్వం చైనాతో స్నేహంగా ఉంటున్నా సామాన్య ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దసు జలవిధ్యుత్ దగ్గర జరిగిన దాడిలో మరణించిన వారికి 38 మిలియన్ల అమెరికన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది జూలై 14వ తేదిన దసు జలవిధ్యుత్ కేంద్రం వద్ద జరిగిన పేలుడులో తొమ్మిదిమంది చైనా ఇంజనీర్లు, నలుగురు పాకిస్తానీయులు చనిపోయారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి.

ఈ ఘటన జరిగిన నాటి నుంచి జలవిద్యుత్ కేంద్రం వద్ద పనులు నిలిచి పోయాయి. చనిపోయినవారికి పరిహారం చెల్లిస్తేనే పనులు పునఃప్రారంభిస్తామని చైనా మెలిక పెట్టింది. ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న పాక్ పౌరులను విధుల నుంచి తొలగించారు. చైనా డిమాండ్ సహేతుకం కాదని పాక్ ప్రభుత్వ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పరిహారం చెల్లింపు జరిగితేనే పనులు మొదలు పెడతామని చైనా కంపనీ షరతు పెట్టడం పాక్ పాలక వర్గాలకు ఇబ్బందికరంగా మారింది.

బెలూచిస్తాన్, ఖైభర్ పఖ్తుంక్వ , పాక్ ఆక్రమిత కశ్మీర్ రాష్ట్రాల్లో చైనా ప్రాజెక్టులను నిరసిస్తూ స్థానికులు దాడులు చేస్తున్నారు. చైనా ప్రాజెక్టుల్లో స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదని పాక్ యువత ఆగ్రహంతో ఉంది. దేశ వనరులు తీసుకెళ్తున్న చైనా స్థానికులకు ఉపాధి ఇవ్వకుండా చైనీయులనే ఉద్యోగుల్లో పెట్టుకోవటం పాక్ ప్రజలకు అసంతృప్తిగా మారింది.

పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నవారు భారత్ బూచి చూపి చైనా దోపిడీకి అవకాశం ఇచ్చారని పాక్ మేధావులు విమర్శిస్తున్నారు. ఆహార అలవాట్లు, సంప్రదాయాలు, సాంస్కృతికంగా భారత్ తో సారూప్యం ఉందని, చైనా తో ఏనాడు సంబంధాలు లేవని, రాజకీయ అవసరాల కోసం పాక్ ప్రభుత్వంలో ఉన్న వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పాక్ మేధావులు ఆరోపిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఇస్లామబాద్, కరాచీ, లాహోర్ నగరాల్లో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సెమినార్లకు యువత పెద్ద సంఖ్యలో హాజరవటం పాక్ నిఘా వర్గాల్ని కలవరానికి గురిచేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్