పాకిస్తాన్ పాలకులు కశ్మీర్ లో మానవహక్కులు కాలరాస్తున్నారని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ రోజు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. 1947 అక్టోబర్ 22వ తేదిన స్వతంత్ర కశ్మీర్ పై ఆపరేషన్ గుల్ మార్గ్ పేరుతో పాక్ పాలకులు దౌర్జన్యంగా ఆక్రమించారు. ఆ సమయంలో అనేకమందిని హతమార్చారు. మహిళలు, చిన్నారులపై పాక్ మిలిటరీ అఘాయిత్యాలకు పాల్పడిందని పాక్ దురాక్రమణలో చనిపోయినవారికి నివాళిగా ముజాఫరాబాద్ లో పౌరులు మౌనప్రదర్శన నిర్వహించారు. 75 ఏళ్లలో ఆక్రమిత కశ్మీర్లో అభివృద్ధి చేయకపోగా ఇక్కడి వనరులు పాకిస్తాన్ కొల్లగొట్టిందని యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ(UKPNP) ఆరోపించింది. పాకిస్తాన్ సైనికబలగాలు, ఇతర అధికార వర్గాలు కాశ్మీర్ నుంచి వెళ్ళిపోవాలని UKPNP డిమాండ్ చేసింది. మహిళలు, చిన్నారుల్ని అపహరించి పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్ భూస్వాములకు పాక్ మిలిటరీ సంతలో సరుకుగా అమ్మేసిందని UKPNP వివరించింది.
జమ్మూకశ్మీర్ మీద పాకిస్తాన్ దాడికి నిరసనగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల్లో వేలమంది పాల్గొన్నారు. ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ మానవ హననానికి ఒడిగట్టిందని నేతలు గుర్తుచేశారు.
అక్టోబర్ 22 కశ్మీర్ ప్రజలకు చీకటి రోజుగా పేర్కొంటూ నెదర్లాండ్ హేగ్ నగరంలోని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు, సానుభూతిపరులు నిరసనలకు సిద్దమయ్యారు. బ్లాక్ డే గా పేర్కొంటూ పాకిస్తాన్ దురాగాతాలపై కార్యక్రమాలు చేపట్టారు. న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ముందు కశ్మీరీలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మద్దతుగా ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పౌరులతో పాటు బలూచిస్తాన్ పౌరులు కూడా ప్రదర్శనలు నిర్వహించారు. లండన్, జెనివా, అంకారా నగరాల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెనక్కి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.