జూనియర్ డాక్టర్లు సమ్మె చేయాల్సిన సమయం ఇది కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని కిషన్ రెడ్డి సందర్శించి ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా, కరోనా చికిత్సలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న 110 సంవత్సరాల వయసున్న రామానంద తీర్థులుని కిషన్ రెడ్డి పరామర్శించారు.
గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లు ధైర్యంగా ఉన్నారని, వారితో ఆత్మ విశ్వాసం కల్పించాలని కిషన్ రెడ్డి అధికారులను కోరారు. కేసులు తగ్గుముఖం పట్టినా పరిస్థితి ప్రమాదకరంగానే ఉందన్నారు. గాంధీ ఆస్పత్రిలో పిఎం కేర్ కింద రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభిచామని వివరించారు.
రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ను కేంద్రం సరఫరా చేస్తోందని, భవిష్యత్తులో జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాని చెప్పారు. ఆస్పత్రుల్లో తగినంత సిబ్బందిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. బ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
.