వ్యాక్సిన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి జగన్ లేఖ రాశారు. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వాక్సిన్ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్ వేయించుకుంటారని, కానీ డిమాండ్ కంటే చాలా తక్కువగా వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్ కొనుగోలుకు అనుమతి ఇవ్వడంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం ఛార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.
కొన్ని ఆస్పత్రులు తమ ఇష్టం వచ్చిన ధరకు వ్యాక్సిన్ ఇస్తున్నారని, రూ. 2 వేల నుంచి 25 వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని, దీనివల్ల సామాన్య ప్రజానీకం నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోందని జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ కొరత వల్ల 45 ఏళ్ళు నిండిన వారికే ఇంకా ఇవ్వలేకపోతున్నామని జగన్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి నెలల తరబడి సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్ పక్కదారి పట్టే అవేకాశం ఉందని, కాబట్టి, ఈ నిర్ణయంపై పునరాలోచించాలని జగన్ ప్రధానిని కోరారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు.