Regional Ring Road Alignment :
హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం అలైన్‌మెంట్‌కు జనవరికల్లా తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అలైన్‌మెంట్‌కు తుదిమెరుగులు దిద్దడానికి కే అండ్ జే సంస్థ అధిపతి జవాడే గురువారం హైదరాబాద్ వచ్చి, నేషనల్ హైవే అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపిన అనంతరం అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ కే అండ్ జే సంస్థను ఎంపిక చేసింది. ఈ సంస్థ మూడు నెలలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించింది. నాలుగు ప్రతిపాతిద అలైన్‌మెంట్లను కేంద్రానికి పంపించింది.
వీటిపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారులు, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు, రాష్ట్ర రహదారులు భవనాలశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు చర్చించారు. ఆయా సమావేశాల్లో వచ్చిన సూచనల మేరకు అలైన్‌మెంట్‌కు కే అండ్ జే సంస్థ తుది రూపం ఇవ్వనున్నది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరికల్లా త్రిబుల్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అలైన్‌మెంట్ ఖరారైన తరువాత పూర్తి స్థాయి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేస్తారు. ఆ తరువాత నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ పక్రియ మొత్తం పూర్తికావడానికి కనీసం 10 నెలలు పడుతుందని భావిస్తున్నారు .
Also Read : ధృవీకరణ పత్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు