Venkaiah on Telugu Language:
తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి తెలుగు భాషపై నిర్లక్ష్యం చూపవద్దని హితవు పలికారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో తెలుగు యూనివర్సిటీ చేస్తున్న కృషిని అయన కొనియాడారు.
తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా భాషా పరిరక్షణకు, వైభవానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతో కృషి చేశారని ఉప రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. ఈ విశ్వవిద్యాలయం సేవలను మరింత విస్తృత పరిచి తెలుగు భాషాభివృద్ధికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషిచేయాలని అయన సూచించారు. బాచుపల్లిలో వంద ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం విస్తరణకు తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎల్లలు చెరిగి పోతున్నాయని, ఎల్లలు చెరిగినంత మాత్రాన మన గతం మచిపోకూడదని అభిప్రాయపడ్డారు. మాతృ భాష కళ్ళలాంటిదని, విదేశీ భాష కళ్ళద్దాల లాంటిదని… కళ్ళు ఉంటేనే కళ్ళద్దాలు వాడగలమని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులకు తెలుగు విశ్వ విద్యాలయం తరఫున 2018, 2019 సంవత్సరాలకు గాను విశిష్ట పురసారాలను వెంకయ్య ప్రదానం చేశారు.
Also Read : తెలుగు కళా వైభవం గొప్పది: గవర్నర్