summons Served: కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్ వ్యవహారంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది. అరెస్టు చేసిన తీరును తీవ్రంగా పరిగణించిన కమిటీ ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌కు లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని వారిని ఆదేశించింది.
నిన్న సమావేశమైన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట బండి హాజరయ్యారు. తనను అరెస్టు చేసిన విధానంపై అయన కమిటీ ఎదుట వివరించారు.. తన హక్కులకు భంగం కలిగే విధంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని వాపోయారు. నాటి ఘటనకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్స్ ను, వీడియో ఫుటేజ్ ను కమిటీకి సమర్పించారు. ఈ ఆధారాలను ప్రాథమికంగా పరిశీలించిన అనతరం కమిటీ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య అధికారులకు సమన్లు ఇచ్చింది.
జీవో నంబర్ 317 కు వ్యతిరేకంగా జనవరి 2 న జాగరణ్ దీక్షను బండి చేపట్టారు. ఈ దీక్ష సందర్భంగా బిజెపి, టిఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసులు బలవంతంగా గ్యాస్ కట్టర్లతో తలుపులు తెరిచి లోపలకు వెళ్లి బండి సంజయ్ ను అరెస్టు చేశారనే ఆరోపణలు వచ్చాయి. తన అరెస్టు తీరుపై బండి పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటి కి ఫిర్యాదు చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపింది.
Also Read : బండి సంజయ్ విడుదల