గడచిన ఏడేళ్లలో తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయిందని, ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో 60 లక్షల ఎకరాలలో పత్తి ఉత్పత్తి చేస్తూ నంబర్ వన్ స్థానం తెలంగాణ దేనని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 2, ధాన్యం సేకరణలో దేశంలో నంబర్ 2 స్థానాల్లో తెలంగాణ ఉందని మంత్రి వెల్లడించారు. ‘పాలమూరు గోస‘ పేరుతో 160 మంది కవులు రాసిన కథనాలు, కథలు, కవితల సంకలనంతో కూడిన పుస్తకాన్ని మహబూబ్ నగర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు.
2014 – 15 నాటికి 24 లక్షల 29 వేల 536 టన్నుల ధాన్యం సేకరణ జరిగేది. 2021 నాటికి అది కోటీ 41 లక్షల 8784 మెట్రిక్ టన్నులు తెలంగాణ రైతుల నుండి సేకరించి ఎఫ్ సీ ఐకి ఇవ్వగలిగామన్నారు. 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు కాగా 2021 నాటికి అది 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిందని.. ఇది కాకుండా ఏటా 11.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయని తెలిపారు. ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని 26 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత కరంటు అందించడం జరుగుతున్నదని, గత ఎనిమిది విడతలలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50,448.16 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామని మంత్రి చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ. భూగర్భ జలమట్టం పెరిగిందని, రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించి ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో 2601 రైతు వేదికలను నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాకుండా సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను ముందుగానే తెప్పించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర పద్దతుల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతున్నదన్నారు.
ఏటా దేశానికి అవసరమయ్యే సుమారు ఆరు కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు గాను మూడు కోట్ల ప్యాకెట్లు అందిస్తున్న తెలంగాణ, పంటలకు గిట్టుబాటు ధర కోసం వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఆహారశుద్ది పరిశ్రమలు తీసుకొస్తున్నామని నిరంజన్ రెడీ చెప్పారు. ప్రతి గుంట భూమిలో ఏ పంటలు పండిస్తున్నారో రికార్డ్ చేయడానికి క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రమని, దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేశామన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు దీర్ఘకాలంలో మేలు చేసే ఆయిల్ పామ్ సాగు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రాబోయే మూడేళ్లలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. రైతన్నల కోసం, నేలతల్లి కోసం నిరంతరం పరితపించేటువంటి నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కారణంగా నేడు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.