New districts: ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని రాష్ట్ర ప్రణాళికా శాఖకార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను మార్చి 3 వరకు స్వీకరిస్తామని చెప్పారు.
శనివారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం పై రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కడప జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరుగుతోందని ఇప్పటి వరకూ ఆయా జిల్లాల కలెక్టర్లకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు మీద స్టడీ చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. మార్చి 3 వరకూ వచ్చిన అభ్యంతరాలు, సలహాలు మీద వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకుని కలెక్టర్ లు వారి ఆలోచనలను ప్రభుత్వానికి పంపిస్తారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. వీటిపై ప్రభుత్వం కూలంకషంగా చర్చించి ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
రాయలసీమలో నాలుగు జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు సుమారు 16 వందల కుపైగా వచ్చాయని, సమస్యల వారిగా తీసుకున్నప్పుడు ఒక్కో జిల్లాలో 5, 6 అంశాలు మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంగా పెనుకొండ లేదా హిందూపురం చేయాలని కానీ పుట్టపర్తిని చేస్తున్నారనే భావన వ్యక్తమైందని, ఆ అంశం పూర్తిగా పరిశీలనలో ఉందన్నారు. దీంతోపాటు రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్ లో కలపాలని అడుగుతున్నారన్నారు.
కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలో ఉంచమని, అవకాశం ఉంటే కొత్త జిల్లాలు ఇంకా ఏర్పాటు చేయమని కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు.
కడప జిల్లాకు సంబంధించి ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలని, చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరిని తిరుపతిలో ఉంచాలని ప్రధానమైన అంశాలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి అంశానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తున్నామని, వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది చూస్తున్నామని, గతంలో చెప్పినట్టుగా చారిత్రాత్మక భావాలు, ఆ ప్రాంతంలో సాంస్కృతిక పరమైన అనుబంధాలు, ఆర్థిక పరమైన అభివృద్ధి లాంటి అన్ని రకాల కారణాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయాలు ఉంటాయన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, వారి భావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. కొత్త జిల్లాలకు కేటాయించి ఉద్యోగులకు పని విభజన మాత్రమే ఉంటుంది. ఆర్డర్ టు సర్వ్ ప్రాతిపదికన వారు విధులు నిర్వహిస్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లుగా ఉగాది నుంచి కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయన్నారు.
ఈ సమావేశంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి తదితరులు పాల్గొన్నారు.