Great Loss: అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈ రోజు ఉదయం అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. 1966లో వచ్చిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నవరాత్రి చిత్రంతో దర్శకునిగా కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు, హిందీ భాషల్లో కలిపి 80 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. హిందీలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన తెలుగు దర్శకుడిగా రామారావు హిస్టరీ క్రియేట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. తాతినేని రామారావు గారు అద్భుతమైన దర్శకులు. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే యమగోల లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన తల్లితండ్రులు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది.
“నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు.
Also Read : నారాయణ్ దాస్ నారంగ్ ఇకలేరు.