IPL-2022: మిస్టర్ కూల్ ధోనీ మరోసారి తన సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్ తో నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి బంతిని ఫోర్ గా మలిచి చెన్నైకు అద్భుత విజయం అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో మొదటి విజయం అందుకోవాలన్న ముంబై ఆశలు ఆడియాశలు చేశాడు. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి ప్రేటోరియస్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన బ్రేవో రెండో బంతికి సింగిల్ సాధించి స్ట్రయిక్ ను ధోనీకి ఇచ్చాడు. మిగిలిన నాలుగు బంతుల్లో 6,4,2,4తో 16 పరుగులు రాబట్టి మ్యాచ్ ను ధోనీ విజయవంతంగా ముగించాడు.
నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై పరుగుల ఖాతా ప్రారంభించకముందే తొలి వికెట్ (రోహిత్ డకౌట్) కోల్పోయింది. రెండు పరుగుల వద్ద మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లూ ముఖేష్ చౌదరి కే దక్కాయి. వన్ డౌన్ లో వచ్చిన డివాల్ద్ బ్రేవీస్ కూడా కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 32; హృతిక్ షోకీన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు; బ్రావో రెండు; మిచెల్ శాంట్నర్, మహీష్ తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.
చెన్నై కూడా పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ (రుతురాజ్ గైక్వాడ్ డకౌట్) కోల్పోయింది, 16 వద్ద మిచెల్ శాంట్నర్ (11) కూడా ఔటయ్యారు, ఈ దశలో రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఊతప్ప 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయగా, శివమ్ దూబె 13 కే వెనుదిరిగాడు. అంబటి రాయుడు 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులచేసి ఔటయ్యాడు. జడేజా (3) విఫలమయ్యాడు. ధోనీ – ప్రేటోరియస్ 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్ తొలి బంతికి ప్రేటోరియస్ అవుట్ కావడంతో మ్యాచ్ ముంబై వైపు మల్లినట్లు అనిపించింది. కానీ ధోనీ సూపర్ ఇన్నింగ్స్ తో చెన్నై విజయం సొంతం చేసుకుంది. ధోనీ 13 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్ తో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో డానియెల్ శామ్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా, జయదేవ్ ఉనాద్కత్ రెండు, రిలే మేరెడిత్ ఒక వికెట్ పడగొట్టారు.
ముఖేష్ చౌదరికి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం