శ్రీలంక ద్వీప దేశ స్వతంత్ర చరిత్రలో అత్యంత అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆహార పదర్థాల నుంచి వంట గ్యాస్ వరకు ప్రతి దానికీ కొరత ఉంది. దీంతో ఆసియాలో సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న సిలోన్ లో వేగవంతమైన ద్రవ్యోల్బణం ఏర్పడింది. ఈ దేశంలో ధరలు దాదాపు 30 శాతం పెరిగాయి. ఇవి సామాజిక అశాంతి, రాజకీయ గందరగోళానికి దారితీశాయి.
దేశ వ్యాప్తంగా ఎన్నో నిరసనల తరువాత ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే పదవి చేపట్టారు. అయితే బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే దేశంలో ఒక రోజుకు సరిపడా గ్యాసోలిన్ స్టాక్ మాత్రమే ఉందని చెప్పారు. ముడి చమురు, ఫర్నేస్‌తో కూడిన మూడు నౌకలకు చెల్లించడానికి బహిరంగ మార్కెట్‌లో డాలర్లను పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గత సోమవారం చెప్పారు. ఇంధనం కోసం లైన్‌లో వేచి ఉండవద్దని ప్రజలను అభ్యర్థించామని మంత్రి చెప్పారు. ‘‘డీజిల్‌తో సమస్య లేదు. కానీ దయచేసి పెట్రోల్ కోసం లైన్‌లో నిలబడకండి. మనకు పరిమితమైన పెట్రోల్ స్టాక్ ఉంది. దానిని అవసరమైన సేవలకు అంటే ముఖ్యంగా అంబులెన్స్‌లకు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో పెట్రోలు పంపిణీ పూర్తి కావడానికి శుక్రవారం తరువాత మరో మూడు రోజులు పడుతుంది ’’ అని చెప్పారు.
ప్రస్తుతానికి డీజిల్ మాత్రం సరిపడా ఉందని చెప్పడం కాస్త ఊరట కలిగిస్తోంది. గత రెండు నెలలుగా శ్రీలంక తీరంలో పెట్రోల్ నౌకలు నిలిపి ఉన్నా.. వాటికి చెల్లింపులు చేసి ఇంధనాన్ని దించుకునేందుకు డాలర్లు లేవని ప్రభుత్వం అంటోంది. గతంలో బకాయిలను కూడా చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ బకాయిలను చెల్లించేవరకు పెట్రోల్‌ను దిగుమతి చేయబోమని షిప్పింగ్ కంపెనీ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పెట్రోల్ కోసం బంకుల వద్ద క్యూలైన్లలో నిల్చోవద్దని శ్రీలంక విద్యుత్, ఎనర్జీ మంత్రిత్వ శాఖ బుధవారం పార్లమెంట్‌లో చేసిన ప్రకటనలో పేర్కొంది.
Also Read : శ్రీలంకలో చల్లారని ఆందోళనలు