Botsa Fire: చంద్రబాబుకు వయసు పెరిగితే సరిపోదని, బుద్ధి కూడా పెరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వీలైతే నాలుగు మంచి సలహాలు, ఆలోచనలు ఇవ్వాలని అంతేగానీ పనికి మాలిన మాటలు మాట్లాడ కూడదని ఘాటుగా విమర్శించారు. బాబు తన కుమారుడు లోకేష్ ను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న విజయనగరం జిల్లాలో ఆంగ్లమాధ్యమంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేసిన విమర్శలను బొత్స తీవ్రంగా ఖండించారు. బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకుంటే అపహాస్యం చేసేలా మాట్లాడడం సరికాదన్నారు. కేవలం మమ్మీ డాడీ అని పిలవడానికే ఇంగ్లీష్ మీడియం చదివిస్తారా అంటూ మండిపడ్డారు. నీ కొడుకు ఇంగ్లీష్ మీడియం, విదేశాల్లో చదువుకోవాలి కానీ, గ్రామీణ ప్రాంతాల్లోనివారు, పేద పిల్లలు మాత్రం చదువుకో కూడదా అని బొత్స నిలదీశారు.
బైజూస్ తో ఒప్పందం తప్పంటూ ప్రపంచంలో ఒక్కరితోనైనా చెప్పించాలని బాబుకు బొత్స సవాల్ చేశారు. 35లక్షల మంది పిల్లలకు బైజూస్ అందించే ఈ కంటెంట్ తో ఎంతో ప్రయోజనం ఉంటుందని, 20 వేల రూపాయల విలువైన ఈ యాప్ ను ఉచితంగా మన విద్యార్ధులకు అందించేందుకు వారు ముందుకొస్తే…. ఈ ఒప్పందంపై విమర్శలు చేయడం దారుణమని బొత్స అన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని ధ్వజమెత్తారు.
సామాజిక న్యాయంపై డిబేట్ కు సిద్ధమంటూ బాబు చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు బొత్స ప్రకటించారు. ఎవరితోనైనా చర్చకు సిద్ధమని, అశోక్ గజపతి రాజునైనా పంపాలని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు గత ప్రభుత్వం హయంలో విజయనగరం జిల్లా నుంచి ఒక రాజ వంశం నుంచి అశోక్ గజపతికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని, తమ పార్టీలో గెలిచి టిడిపి లోచేరిన మరో రాజుకు మంత్రి పదవి ఇచ్చారని ఇదేనా బాబు చేసే సామాజిక న్యాయం అని నిలదీశారు. అదీ కూడా విజయనగరం జిల్లాలో దీనిపై మాట్లాడడం హస్యాస్పదమనన్నారు.
Also Read : బొత్సకు పద్మశ్రీ ఇవ్వాలి: బాబు