పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సోదరి సుభద్ర, అన్న భలభద్రుడితో పూరీ పుర విధుల్లో అందరివాడై రథంపై జగన్నాథుడు ఊరేగారు. జై జగన్నాథ నామ స్మరణతో పూరీ పులకించింది. సాక్షాత్తు ఆ జగన్నాథుడే జనం మధ్యకు కదిలివచ్చిన అపూర్వ ఘట్టంతో పూరీ వీధులు కిక్కిరిసిపోయాయి. రథయాత్ర కన్నుల పండువగా సాగుతోంది.
యాత్రను పురస్కరించుకుని మూల విరాటులను వరుస క్రమంలో రథాలపైకి ఎక్కించి, దించడం గొట్టి పొహొండిగా వ్యవహరిస్తారు. గుండిచా మందిరం అడపా మండపంపై కొలువు దీరిన జగన్నాథుని దర్శించుకుంటే జీవితం పావనం అవుతుందని భక్తులు విశ్వాసం. ఈ ప్రాంగణంలో స్వామికి నివేదించిన అన్న ప్రసాదాలు(ఒభొడా) లభించడం పుణ్యప్రదంగా భావిస్తారు.
శ్రీమందిరానికి యథాతధంగా తరలి వచ్చేలోగా జరిగే ప్రత్యేక ఉత్సవాలు యాత్రికుల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. వీటిలో హిరా పంచమి, సంధ్యా దర్శనం(నవమి), మారు రథయాత్ర(బహుడా), హరి శయన ఏకాదశి(స్వర్ణాలంకారం), అధర సేవ, గరుడ శయనసేవ, నీలాద్రి విజే ప్రధానమైనవి.
Also Read : అమర్ నాథ్ యాత్ర ప్రారంభం