శ్రీలంక- ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో ఇండియా 39 పరుగులతో విజయం సాధించింది. ఇండియా మహిళలు విసిరిన 256 పరుగుల విజయ లక్ష్యం ఛేదనలో లంక విఫలమై 47.3 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక ప్లేయర్ నిశాంక డిసిల్వా చివరి వరకూ గెలుపు కోసం పోరాటం చేసినా సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో పరాజయం తప్పలేదు.
పల్లెకలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో సత్తా చాటిన స్మృతి మందానా నేడు విఫలమై కేవలం 6 పరుగులకే ఔటయ్యింది. ఈ మధ్య కాలంలో మంచి ఫామ్ ప్రదర్శిస్తోన్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేడు కూడా 75 పరుగులు చేసి సత్తా చాటింది. పూజా వస్త్రాకర్-56 నాటౌట్; ఓపెనర్ షఫాలీ వర్మ-49; యస్తికా భాటియా-30 పరుగులతో రాణించడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో రణవీర, రశ్మి డిసిల్వా, కెప్టెన్ ఆటపట్టు తలా రెండు; కాంచన, రణసింఘే, కవిశ్క దిల్హారీ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన లంక ఏడు పరుగులకే తొలి వికెట్ (వింశీ గుణరత్నె-3) కోల్పోయింది. కెప్టెన్ ఆటపట్టు-44; హాసిని పెరీరా-39; పరుగులతో రాణించారు. మిడిలార్డర్ బ్యాట్స్ వుమెన్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.
ఇండియా బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ మూడు; మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్ చెరో రెండు; దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్, హర్లీన్ డియోల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా దక్కింది.
గత వారం జరిగిన మూడు మ్యాచ్ ల టి20సిరీస్ లో కూడా హర్మన్ ప్లేయర్ అఫ్ ద సిరీస్ గా నిలవడం విశేషం.