కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మహిళా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన టి-20 మ్యాచ్ లో ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బౌలింగ్ లో రాధా యాదవ్, స్నేహ రానా రాణించగా, బ్యాటింగ్ లో ఓపెనర్ స్మృతి మందానా 63 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ జావేద్ డకౌట్ గా వెనుదిరిగింది. రెండో వికెట్ కు మునీబా అలీ, మరూఫ్ లు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత పాక్ వరుస వికెట్లు కోల్పోయింది. మునీబా-32,మరూఫ్-17 మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాట్స్ వుమెన్ విఫలం కావడంతో నిర్ణీత 18 ఓవర్లకు 99 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
ఆ తర్వాత ఇండియా మొదటి వికెట్ కు 61 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 16, షబ్బినేని మేఘన 14 పరుగులు చేసి ఔటయ్యారు. స్మృతి మందానా 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.