గిరిజనులు, ఆదివాసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్లేన్ ఏరియాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికోసం కూడా పాటుపడతామని, వారినుంచి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, పునర్నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడులకు నిర్వహంచారు. దీనితో చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, లేకపోతే రాష్ట్రం సర్వనాశన మవుతుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో వాణిజ్య పంటలను, అరకు కాఫీను తమ హాయంలో ఎంతో ప్రోత్సహించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయంలో గిరిజన, ఆదివాసీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకు వస్తే ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎన్టీఆర్ విద్యోన్నతి, గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ లాంటి ఎన్నో చర్యలు తాము తీసుకుంటే, ఈ ప్రభుత్వం ఆఖరికి గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక స్కూళ్ళను కూడా ఎత్తివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఇటీవలే తాను వారిని పరామర్శించానని… పోలవరం ప్రాజెక్టు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన వారిని ఈ ప్రభుత్వం గోదావరిలో ముంచిందని ఆవేదన వెలిబుచ్చారు.
సిగ్గులేని వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి బాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఊరికో ఆంబోతును తయారు చేస్తొందన్నారు. పార్టీ నేతలు తప్పు చేస్తే పిలిచి మందలించడమో, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో చేయాలని కానీ వదిలేయడం ఏమిటన్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, అనంతపురంలో అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి పక్కరాష్ట్రం వెళ్లి అక్కడినుంచి కేసు పెట్టిందని, నంద్యాల లో ఒక రౌడీ షీటర్ కానిస్టేబుల్ ను హత్య చేసే పరిస్థితి వచ్చిందని, ఒక మహిళా హోంగార్డును వేధించడానికి కానిస్టేబుల్- సిఐ మధ్య గొడవ జరిగిందని బాబు వాపోయారు. తాను ఏదైనా మాట్లాడితే ఎదురుదాడి చేయిస్తున్నారని, తాను బాంబులకే భయపడలేదని, వీరికి భయపడే ప్రసక్తే లేదన్నారు.
Also Read : మాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్