75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో జరగనున్న రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్దం చేశారు.
ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనీటి విందు (ఎట్ హోమ్) కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిఎం జగన్మా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.