భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి 54.60 అడుగుల వద్ద ఉదయం 9 గంటల నుంచి నిలకడగా ఉంది. గత రెండు రోజులుగా మెల్లమెల్లగా పెరిగిన గోదావరి వరద అధికార యంత్రాంగాన్ని, గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను హడలెత్తించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అంగుళం కూడా పెరగకుండా రెండు గంటలపాటు నిలకడగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎగువ ప్రాంతంలోని పేరూరు వద్ద గోదావరి తగ్గుతుండగా, ప్రస్తుతం వర్షాలు, స్థానిక వరదలు లేకపోవడంతో భద్రాచలం వద్ద కూడా వరద ఈ మధ్యాహ్నం నుంచి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద 50 అడుగులకు తగ్గితే భద్రాచలం నుంచి చర్ల వైపుకి రాకపోకలు పునరుద్ధరించబడతాయి. ప్రస్తుతం రవాణ స్తంభణతో దుమ్మగూడెం, చర్ల మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.