Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబండి సంజయ్ ఉవాచ

బండి సంజయ్ ఉవాచ

Gita- Our Life Line: ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత...ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి.

18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. ఈ మాటలను అటు ఇటు జరిపి “క్షేత్రే క్షేత్రే ధర్మం కురు” “ప్రతి చోటా ధర్మాన్నే పాటించు” అన్న అర్థం తీసుకోవాలని పురాణ ప్రవచనకారుల భాష్యం.

అటు ఇటు కురు పాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ…కదనసీమ కురుక్షేత్రం మధ్యలో విల్లమ్ములు పారేసి వైరాగ్యంతో నీరుగారి…యుద్ధం చేయను…అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినది ఈ భగవద్గీత.

మనమేమీ సంసార యుద్ధసీమలో అర్జునుడిలా భయపడి విల్లమ్ములు పారేసి…పలాయనం చిత్తగించలేదే? మరి మనకెందుకు ఈ గీత?

ఎందుకంటే?
కృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికే చెప్పాడు కనుక. ఒక్క అర్జునుడికి మాత్రమే ఇలాంటి వ్యామోహాలు, వైరాగ్యాలు, నిట్టూర్పులు, నిస్సత్తువ, పలాయనవాదాలు లేవు…లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారని కృష్ణుడికి తెలుసు కనుక. ఆ రోజుల్లో వాట్సాప్ లు, ఫేస్ బుక్ లైవ్ లు, శాటిలైట్ లైవ్ లు లేవు కాబట్టి కోట్ల మంది పోగయిన ఒకేచోట అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు. అర్జునుడు ఒక్కడికే అయితే గుడారంలోకి పిలిచి చెవిలో చెప్పేవాడు. మనకు వినపడి ఉండేది కాదు.

భగవద్గీతలో ఏముంది? ఆరోజులకు, ఈరోజులకు, ఎప్పటికయినా అది ఎలా అన్వయమవుతుంది? అన్న విషయాలను ఇంకెప్పుడయినా విడిగా మాట్లాడుకుందాం.

ఘంటసాల ఏ క్షణాన భగవద్గీతలో కొన్ని శ్లోకాలను పాడాడో కానీ…అప్పటినుండి భగవద్గీత శవయాత్రలకు శబ్ద సహకారంగా మారిపోయింది. ఆత్మలకు సంబంధించిన తాత్విక విషయాలు కొన్ని గీతలో ఉండడం, ఘంటసాల వాటిని అనితర సాధ్యంగా పాడడం, చావు పందిట్లో సౌండ్ బాక్సులో ఏమి పెట్టాలో తెలియకపోవడంతో భగవద్గీత చావు పందిరి మేళం అయిన మాట నిజం. ఇలా చచ్చినవారి వెంట నేపథ్య గానం అవుతుందని తెలిసి ఉంటే ఘంటసాల ఎట్టి పరిస్థితుల్లో భగవద్గీత పాడి ఉండేవారు కాదు.

ఇకపై శవయాత్రల్లో భగవద్గీత వినిపిస్తే భౌతిక దాడులు చేసి అడ్డుకుంటాం…వాహనాల టైర్లు కోస్తాం…అంటూ బి జె పి తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక హిందువులే తలలు పట్టుకున్నారు.

Bhagavad Gita

బతికి ఉండగా ఏనాడూ గీతలో ఒక్క మాట వినలేదు…కనీసం చచ్చాక అయినా భగవంతుడి వాక్కు వెంట వస్తోంది…పుణ్యమే కదా? అడ్డుకుంటే ఎలా? హిందువులే హైందవం మీద దాడులు చేస్తే ఎదుటివారి ముందు ఇంకా పలుచన అయిపోమా? అన్నది ఒక వాదన.

మన మెదళ్లలో బూజు దులిపి, మన మనసుల్లో అలముకున్న నైరాశ్యాన్ని పారద్రోలి, వంగిన మన వెన్నెముకలను నిటారుగా నిలబెట్టి, మన జీవన కార్య క్షేత్రంలో యుద్ధానికి కావాల్సిన భౌతిక, బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను బతికి ఉండగా వాడుకుని బతుకును బాగు చేసుకోకుండా…చచ్చాక వినిపిస్తే ఎవరిని ఉద్ధరించడానికి? అన్నది మరొక వాదన.

బహుశా బండి సంజయ్ ది రెండో వాదనే కావచ్చు. రాజకీయ ప్రయోజనం ఆశించకుండా నిజంగా భగవద్గీత అనువుగాని చోట వినిపించకుండా…పొరపాటును సరిదిద్దడం వరకే అయితే ఆయన వాదనతో ఏకీభవించవచ్చు. దానికి దాడులు, టైర్లు కోయాల్సిన అవసరం లేదు.

ఆత్మను-
కత్తి కోయలేదు;
అగ్ని కాల్చలేదు;
నీళ్లు తడపలేవు;
గాలి ఎండింపజేయలేదు.

పాత బట్టలను వదిలి శరీరం కొత్త బట్టలను తొడుక్కున్నట్లు…ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళుతూ ఉంటుంది…చావు శరీరానికే కానీ ఆత్మకు కాదు” లాంటి అర్థవంతమయిన గీతా శ్లోకాలను పెళ్లి పందిళ్లలో, పుట్టినరోజు వేడుకల్లో, గృహప్రవేశాల్లో, బారసాలల్లో ఎలా అన్వయించుకుని…శుభ కార్యాలకు తగిన నేపథ్యంగా ఎలా సౌండ్ బాక్సుల్లో ప్లే చేయాలో కూడా బండి సంజయ్ అలోచించి చెబితే బాగుండేది.

చర్చ ఒకస్థాయికి మించి జరిగితే రచ్చగా మారుతుంది. భగవద్గీత రచ్చకెక్కడం ఎవరికీ మంచిది కాదు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

“వెన్న కృష్ణుడి”తో ఆమె అనుబంధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్