Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం"వెన్న కృష్ణుడి"తో ఆమె అనుబంధం

“వెన్న కృష్ణుడి”తో ఆమె అనుబంధం

Jaya Krishna:

నేను పాడంది
నీకెట్లా నిద్రపడుతుంది!

నేను చెప్పంది
నువ్వెవరికి తెలుసు!

నేను పోనీంది
నువ్వెట్టా తిరుగుతావు!

నేను రానీంది
ఎట్లా వొస్తారు నీతో ఆడుకోడానికి!

అసలు నేను లేంది
నువ్వెట్లా వున్నావు!

ప్రపంచమంతా
నువ్వే ఐనావులే!

ప్రతివాళ్ళ హృదయాల్నీ
లాగావులే!

కొండల్లో గుహల్లో ఆడావులే!

నువ్వెంత అని – దూరానికి పోతున్నావా!

Jasna Salim

కాని నువ్వు
నీ నవ్వులు ఆటలు చిన్నెలు
ప్రేమలు అన్నీ ఓనాడు నాలోంచేగా
నా హృదయంలోంచేగా – రూపొందింది!

– చలంగారి “యశోదాగీతాలు” లోని మాటలివి. ఆయన ఇలాంటివి పదకొండు యశోదా గీతాలు రాశారు. అవి చదువుతుంటే “అల్లరి కృష్ణుడు – యశోద” కళ్ళముందు కనిపిస్తారు. ప్రతి మాటలోనూ కృష్ణుడి అందం హృదయాన్ని స్పర్శిస్తుంది. అటువంటి చిన్ని కృష్ణుడంటే ఎవరికి ఇష్టముండదు. అయితే ఆమెకు చిన్నికృష్ణుడిపట్ల అనురాగం కలగడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఆమె ఓ ముస్లిం కావడమే. ఆమె పేరు జస్నా సలీం!

కృష్ణుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె పొందే ఆనందం అంతా ఇంతా కాదు.
అందులోనూ వెన్న కోసం కుండలో చేయి పెట్టడం, వెన్న తినే చిన్ని కృష్ణుడు…అంటే ఆమెకు ప్రాణం.

జస్నా సలీం కేరళ రాష్ట్రానికి చెందిన స్త్రీ. ఇద్దరు పిల్లల తల్లి. చిన్నికృష్ణుడి బొమ్మలను ఆరేడేళ్ళకు పైగా గీస్తున్న సలీం తాను చిత్రించిన ఓ కృష్ణుడి బొమ్మను కేరళలోని ఉలనాడు శ్రీకృష్ణస్వామి ఆలయానికి ఇచ్చినప్పుడు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ఆలయం ఎనభై ఏళ్ళనాటిది. పత్తనంతిట్టయ్ జిల్లాలోని పందళంలో ఉంది. ఇక్కడి మూలవిరాట్టు చిన్నికృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడు. కృష్ణుడి బొమ్మ గీస్తున్న ప్రతిసారీ ఆమె సాక్షాత్తూ ఆ నవనీతచోరుడికే బొమ్మలు గీసి కానుకగా ఇచ్చినంతగా మురిసి పోతుంటారు.

జస్నా మొదట్లో తను గీసిన కృష్ణుడి బొమ్మలను గురువాయూరులో ఉన్న సుప్రసిద్ధ కృష్ణుడి ఆలయానికి ఇచ్చారు. ఆ విషయం తెలుసుకున్న పందళం ఆలయ కమిటీ నిర్వాహకులు తమకు కూడా అటువంటి చిన్ని కృష్ణుడి పెయింటింగ్స్ ఇవ్వమని కోరారు. గతంలో ఆమె గురువాయూరు ఆలయానికి కృష్ణుడి పెయింటింగ్సుని ఎవరిద్వారానో ఇచ్చినప్పటికీ పందళం గుడికి మాత్రం ఆమె నేరుగా వెళ్ళి ఇవ్వడం విశేషం.

చిత్రాలు గీయడం కోసం ఆమె ఎవరి దగ్గరా కిటుకులు నేర్చుకోలేదు. కృష్ణుడి గురించి అనేక కథలు విన్న జస్నాలో కృష్ణుడి బొమ్మలు చిత్రించాలనే ఆశ పుట్టింది. కృష్ణుడి బొమ్మను ఇంట్లో పెట్టుకోనిస్తారో లేదో అనే సందేహం తలెత్తింది. కానీ ఆమె కృష్ణుడి బొమ్మగీయడంలో ఎలాంటి సమస్యా తలెత్తలేదు.

ఆమె మొదటిసారిగా వేసిన కృష్ణుడి పెయింటింగుని తన మిత్రులైన ఓ నంబూద్రి కుటుంబానికి ఇచ్చారు. ఆ పెయింటింగుని చూసి నంబూద్రీ కుటుంబం ఆశ్చర్యపోయింది. ఆమె చిత్రకళను ఆశీర్వదించారు. అప్పటి నుంచీ ఆమె కృష్ణుడి పెయింటింగ్స్ వేయడం కొనసాగించారు. మొదటిసారి చేతులు కట్టుకున్న కృష్ణుడి పెయింటింగ్ వేసిన ఆమె అనంతరం వెన్న కోసం కుండలో చేయి పెట్టిన కృష్ణుడి బొమ్మ వేసారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ఆమె ఇప్పటి వరకూ కొన్ని వందల బొమ్మలు గీయడం గమనార్హం.

వెన్న కుండలతో ఉన్న కృష్ణుడి బొమ్మలనే ఆమె ఎక్కువగా గీయడానికి కారణం – తనకిష్టమైన వెన్నతో కనిపించే దేవుడు కృష్ణుడొక్కడేనట. అందుకే అటువంటి చిన్ని కృష్ణుడి బొమ్మలే ఎక్కువగా చిత్రిస్తూ తృప్తి పొందుతున్నారు.

ఆమె కృష్ణుడి బొమ్మలు గీయడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో వాటిని గురువాయూర్ ఆలయానికి ఇవ్వాలని చెప్పింది ఆమె మేనమామే. గురువాయూర్ ఆలయానికి వెళ్ళివచ్చిన వారు అక్కడ ప్రదర్శనకుంచిన ఆమె కృష్ణుడి పెయింటింగ్స్ ఎంతో బాగున్నాయని ప్రశంసించారు.

చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు జస్నాను “కన్నా” అని పిలుస్తుండేవారు. కన్నా అంటే కృష్ణుడిని అర్థం. ఆమె మొదటిసారిగా ఓ వార్తాపత్రికలో చిన్నికృష్ణుడి బొమ్మ చూసారు… అదెంతగానో నచ్చింది. వెంటనే ఆ బొమ్మ గీసారు. మనసుకి తృప్తిగా అన్పించింది. “చదువుకుంటున్న రోజుల్లో మన భారత దేశం మ్యాపు గీయడానికే శ్రమపడిన నేను కృష్ణుడికి సంబంధించి వందల పెయింటింగ్స్ వేయడం నాకే ఆశ్చర్యంగా ఉందం” టారు జస్నా! కేరళ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారుకూడా అడిగి మరీ నాతో కృష్ణుడి బొమ్మలు గీయించుకుంటున్నారు. కృష్ణుడి పెయింటింగ్స్ వల్ల తను పొందుతున్న మానసికానందమూ, తృప్తీ మాటల్లో చెప్పలేను” అంటారు జస్నా సలీం

– యామిజాల జగదీశ్

Also Read :

శివ పార్వతుల చదరంగం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్