అది ఉత్తర కేరళలోని ఓ గ్రామం. పేరు మరోట్టిచల్. 1960, 70 దశకాల్లో ఆ ఊళ్ళో అధిక శాతం మంది మద్యం తాగుతూ అదే జీవితమని బతికేవారు. ఈ తాగుడు అలవాటుతో ఊళ్ళోనే కాక ఇళ్ళల్లోనూ అనేక సమస్యలు తలెత్తాయి. ఎప్పుడూ గొడవలే. అయితే క్రమంగా గ్రామ ప్రజలు తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు. ఈ దురలవాటు నుంచి బయటపడటం ఎలా అని ఆలోచించారు.
కొందరు పెద్దలు ఎక్సయిజ్ శాఖ అధికారులను కలిసి తమ గోడు వినిపించారు. ఊళ్ళో అక్రమంగా అమ్ముతున్న మద్యందార్ల భరతం పట్టమని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తులు తమ కష్టాన్నయితే చెప్పుకున్నారు కానీ అది పెద్దగా లాభించలేదు. మద్యం బానిస నుంచి ఇవతలకు రాలేకపోయారు. ఏం చేయాలో దీర్ఘంగా ఆలోచించారు. అయితే ఆ ఊళ్ళో సి. ఉన్నికృష్ణన్ అనే అతనికి ఓ మెరుపులాటి ఆలోచన తళుక్కు మంది. అతనికి ఊళ్ళో చిన్నపాటి టీకొట్టు ఉండేది. గ్రామస్తుల దృష్టిని ఆకట్టుకోవడం కోసం తన దుకాణంలో చదరంగం ఆడటం ప్రవేశపెట్టాడు. టీ తాగడానికొచ్చే వారందరితో అనునయంగా ఆప్యాయంగా మాట్లాడుతూ చదరంగం గురించి చెప్తూ వారితో ఆడించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఊరు ఊరంతా వ్యాపించింది. మగవాళ్ళు మాత్రమే కాకుండా మహిళలూ యువకులూ వయోభేదం లేకుండా ప్రతిఒక్కరూ చదరంగం నేర్చుకుని ఆడటానికి ముందుకొచ్చారు. క్రమంగా చదరంగం ఆడేవాళ్ళెక్కువై మద్యం తాగే అలవాటుకు పూర్తిగా “చెక్” పెట్టేశారు. ఉన్నికృష్ణన్ దగ్గర వందల మంది చదరంగం ఆడటం ఎలా అనేది నేర్చుకున్నారు.
చదరంగం బోర్డులో రాజుని నిలుపుకోవడం కోసం మిగతా పావులతో ఎలా పోరాడుతామో అలాగే నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలనం అధిగమించడానికి పోరాటం తప్పదని గ్రామస్తులు తెలుసుకున్నారు. గ్రామస్తులందరూ ఉన్నికృష్ణన్ కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
నిజానికి చదరంగ క్రీడకు పుట్టినిల్లు మన భారతదేశమే. బాబీ ఫిషర్, పాల్ మర్ఫీ, మిహాయిల్ తల్, విశ్వనాథన్ ఆనంద్, కాస్పరోవ్ వంటి మేటి క్రీడాకారులను అందించింది చదరంగం. ఓ సమస్య ఎదురైనప్పుడు దానిని అధిగమించడం ఎలా అనే దానికి ఆలోచించాలి. ఎత్తుకుపైయెత్తు వేయాలి. అందుకు మెదడు చాకులా పని చేయడం ముఖ్యం. మన దేశంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయినప్పటి నుంచి ఈ క్రీడపట్ల ఆకర్షితులై రాణించడం మొదలుపెట్టారు. తన గ్రామస్తులతో మద్యం నుంచి దూరం చేయడానికి ఉన్నికృష్ణన్ పరిచయం చేసి నేర్పించిన చదరంగ క్రీడ సత్ఫలితాన్నిచ్చింది. ఈ ఊళ్ళో నుంచి ఎందరో ఆటగాళ్ళు గుర్తింపుపొందారు. మొదట్లో పదుల సంఖ్యలో ఆడినవారి సంఖ్య క్రమంగా వేలల్లోకి చేరింది. ఆర్థికసమస్యలతో చిక్కుల్లో పడిన కుటుంబాలెన్నో దారిలోకొచ్చాయి. వారి జీవితాలు కోలుకుని నిలదొక్కుకోవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఉన్నికృష్ణన్ తెలిపారు.
ఈ పల్లెప్రాంతం పట్టణంగా మారి నగరస్థాయికి చేరింది. ఇక్కడ ఓ చెస్ అసోసియేషన్ కూడా ఆరంభమైంది. బేబీ జాన్ అనే అతను ఈ సంఘానికి అధ్యక్షుడై చదరంగక్రీడకు మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టాడు.ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా కూడా తీశారు. అయిదేళ్ళ పిల్లలు మొదలుకుని ఎనభై ఏళ్ళ వృద్ధులవరకూ చదరంగం ఆడటం నిత్యకృత్యమైంది. చదరంగం సంఘం కార్యదర్శి సాజి మిషన్ చెస్ సంపూర్ణ పేరుతో చిన్నపిల్లలకు యువకులకు ఈ ఆటలోని కిటుకులు దగ్గరుండి నేర్పిస్తూ వచ్చారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణా తరగతులు మొదలుపెట్టి ఆటపట్ల ఆసక్తి పెంచడం విశేషం.
నిజంగానే చదరంగం ఓ మంచి క్రీడ. కానీ ప్రేక్షక పాత్ర కన్నా ఆడి పావులు కదపడంలోనే ఉంటుంది మజా అంతే. నాకు కొద్దో గొప్పో చదరంగం గురించి పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో మా ఇంటి యజమాని ఎన్.పి. మాధవన్ తో ఆడుతుండేవాడిని. మొదట్లో అతని మీద ఆడి గెలుస్తూ వచ్చాను. కానీ క్రమంగా అతను తన ఆట తీరును మెరుగుపరచుకుని నామీద గెలవడమేకాక టోర్నమెంట్లలో పాల్గొని బహుమతులుకూడా అందుకోసాగాడు. ఎంత పట్టుగా ఆడినా ఓడిపోతుండేవాడిని. తర్వాత ఆడపాదడపా ఆడుతున్నా మళ్ళా కొన్నిరోజులుగా ఇప్పుడు చదరంగం ఆడుతున్నాను. మా పక్కవాటా కుర్రాడొకడు తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నాడు. అతని పుట్టినరోజుకి ఓ కుర్రాడు చదరంగం సెట్ కానుకగా ఇచ్చాడు. వాళ్ళింట ఎవరికీ చెస్ ఆడటం తెలీదు. కానీ ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఆడతావా అంకుల్ అనడంతో సరేనని ఆడటం మొదలుపెట్టాను. మొదట్లో అయిదు పదినిముషాలకల్లా ఓడిపోతుండే ఆ కుర్రాడు ఇప్పుడు అర గంట దాకా ఆడేస్థాయికి పుంజుకున్నాడు. అలవోకగా గెలుస్తూ వచ్చిన నేను ఓ పావు జరిపేటప్పుడు ఒకింత ఆలోచించక తప్పలేదు. రెండు గుర్రాలతో మాత్రమే ఎత్తులు వేస్తూ ఒకరిద్దరు ఆడటం చూశాను. అలాగే క్వీన్ తో ఆట కట్టించిన వారినీ చూసాను. ఏమైనా చదరంగం ఆడటం ఓ మజాయే. మెదడు చురుకుగా పనిచేస్తుందని మనో వైజ్ఞానిక వేత్తలు, వైద్య నిపుణులు చెపుతున్నారు.
– యామిజాల జగదీశ్
Also Read :