డా. వైఎస్సార్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు వెన్నుపోటుతో సిఎం అయ్యారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఆయన స్పూర్తితోనే నేడు జగన్ పరిపాలన సాగిస్తున్నారని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక న్యాయం లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని వివరించారు. వైఎస్ రెండు సార్లు ఒంటి చేత్తో పార్టీని గెలిపించారని, కానీ చంద్రబాబు మూడుసార్లు సిఎం అయితే మొదటి సారి ఎన్టీఆర్ గెలిస్తే ఆయన్ను గద్దెదించి పదవి లాక్కున్నారని, మిగిలిన రెండు సార్లు బిజెపి వల్ల గెలిచారని పేర్కొన్నారు. తొలిసారి సిఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి 27 ఏళ్ళు అయ్యాయని చంద్రబాబు, టిడిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, కానీ ఎలా సిఎం అయ్యారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కబ్జా చేసుకున్న పార్టీని మాఫియాలా నడుపుతున్నారని దుయ్యబట్టారు.
పాలనలో మునిగి పార్టీని నిర్లక్ష్యం చేశానన్న చంద్రబాబు వ్యాఖ్యలను సజ్జల ఎద్దేవా చేస్తూ అయన ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించలేదని, పాలన ద్వారా ఎలా దోచుకోవాలో ఆలోచించారని విమర్శించారు. తాను ఓడిపోయినప్పుడల్లా ప్రజలను నిందించడం బాబుకు పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికే ప్రజలకు దూరమైన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని, కానీ ఇవి దింపుడు కళ్ళెం ఆశలు మాత్రమేనని కొట్టిపారేశారు. తనకు వంత పాడే మీడియా సహకారంతో, ప్రచారంతో మళ్ళీ సిఎం కావాలని అనుకుంటున్నారని కానీ అయన ఆశలు నెరవేరే ప్రసక్తే లేదన్నారు సజ్జల.
Also Read : ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు: బాబు