జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బలనిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ మొదలైన కాసేపటికే విశ్వాసపరీక్ష తీర్మానాన్ని సీఎం హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాసేపు దీనిపై చర్చించారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ తమ ప్రభుత్వానికి అడ్డంకులను సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారని.. బెంగాల్‌కు వారు వెళ్లడం వెనుక అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై విచారణకు వెళ్తున్న పోలీసులకు ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మండిపడ్డారు.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ కావాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విశ్వాసపరీక్షలో హేమంత్ సోరెన్‌కు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. యూపీఏ కూటమికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మైనింగ్ స్కామ్‌లో సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈసీ సిఫారసు చేసింది. అయితే ఇప్పటివరకు గవర్నర్ ఈసీ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read : హేమంత్ సోరెన్ పై ఈడీ దాడులు