Mini Review: చిరంజీవి కథానాయకుడిగా ‘గాడ్ ఫాదర్ ‘ సినిమా ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్వీ ప్రసాద్ – ఆర్. బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. గతంలో మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది. తన నుంచి అభిమానులు ఆశపడే .. ఆశించే అంశాలు ఈ సినిమాలో ఏమీ లేకపోయినప్పటికీ, తన వయసుకి తగిన పాత్రలో కనిపించాలనే ముచ్చటతో చిరంజీవి ఈ ప్రయోగం చేశారు. లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన చిరంజీవి, ‘గాడ్ ఫాదర్’ పై అంచనాలు పెంచుతూ వెళ్లారు. అలా ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. దసరా సెలవులు కావడంతో చాలా ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి.
ఒక వైపున కుటుంబం .. మరో వైపున రాజకీయంతో ముడిపడిన కథ ఇది. ఈ రెండింటి మధ్య ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చనిపోవడం .. ఆ వెనుక కొన్ని స్వార్ధ శక్తులు పనిచేయడం … ఆ స్వార్థశక్తుల ఆటకట్టించడానికి ‘గాడ్ ఫాదర్’ రంగంలోకి దిగితే అదే కుటుంబానికి చెందినవారు అడ్డుపడటం .. ఇలా కథ సాగుతుంది. కథాకథనాల పరంగా చూసుకుంటే కొత్తదనమేదీ కనిపించదు. కానీ ఇక్కడ ఒక వైపున చిరంజీవి ఉంటే .. మరో వైపున నయనతార ఉంది. ఇద్దరి మధ్యలో సత్యదేవ్ ఉంటాడు. ఈ మూడు పాత్రలను తీర్చిదిద్దిన విధానమే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తుంది. అలాగే ఆడియన్స్ జారిపోకుండా కథలో మోహన్ రాజా చేసిన మార్పులు కలిసొచ్చాయి.
ఈ సినిమాకి సల్మాన్ పాత్ర ఎంతవరకూ అతుకుతుందా అనే విషయంలోనే చాలామంది డౌట్ పడ్డారు. కానీ ఆ పాత్రను ఇంటర్వెల్ సమయంలో ఎంట్రీ ఇప్పించడం … క్లైమాక్స్ లోను ఆ పాత్రను చిరంజీవికి సపోర్టుగా నిలబెట్టిన తీరు బాగుంది ఈ సినిమాలో చిరంజీవి పాత్రకీ లక్ష్మి భూపాల్ అందించిన సంభాషణలు కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. పదవి … అధికారం .. హోదా వీటన్నిటికంటే అనుబంధాలు గొప్పవనే చిన్నపాటి సందేశం కూడా మెగాస్టార్ పాత్ర ద్వారా ఇప్పించారు. ఇక పూరి … సునీల్ … మురళీశర్మ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ, పూర్తిగా రాజకీయాలచుట్టూ తిరిగే ఈ కథకి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు ఏ స్థాయిలో లభిస్తుందనేది చూడాలి