రాష్ట్ర పార్టీలో సమన్వయ లోపం ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్షీనారాయణ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు అది లేదని, పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదని, అన్నీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా చూసుకుంటున్నారని, సమస్య అంతా ఆయన వల్లే వస్తోందని, ఎవరితోనూ చర్చించడం లేదని చెప్పారు.
పవన్ కళ్యాణ్ తో సఖ్యత విషయంలోనూ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా విఫలమైందన్నారు, ఏపీలో పార్టీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జాతీయ నాయకత్వం వీలైనంత చొరవ చూపాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉంటాయో తాను చెప్పలేనన్నారు. పొత్తుల విషయంలో మాట్లాడాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది తమ పార్టీ జాతీయ అధ్యక్షుడేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ మురళీధరన్ సమన్వయం చేయాలని ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు తెలిసిందన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రాక్షస పాలన నడుస్తోందని ఈ విషయాన్ని తాను రెండున్నరేళ్ళ క్రితమే తాను చెప్పానని, ఇప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయని కన్నా చెప్పారు. ఈ పాలనపై, సిఎం జగన్ పోకడలపై రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.