Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రత్యర్థి గెలిస్తే ...తానోడుతోందా?

ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?

Who won? Who Lost?:

మహాభారతంలో ద్రౌపది ప్రశ్న:-
“తానోడి నన్నోడెనా?
నన్నోడి తానోడెనా?”

ఆధునిక భారతంలో శశి థరూర్ అడగాల్సిన ప్రశ్న:-
“ఖర్గేను గెలిపించి…నన్నోడించారా?
నన్నోడించి ఖర్గేను గెలిపించారా?”

భారతీయ సనాతన ధర్మంలో వేదాంతం, వైరాగ్యం చాలా ప్రధానమయినవి. జ్ఞానానికి పరాకాష్ఠ వైరాగ్యమే అని గుర్తించి…వైరాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా శంకరాచార్యులు చాలా స్పష్టంగా “జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షామ్ దేహి” అని అన్నపూర్ణను ప్రార్థించాడు.

Karge

ఈ దేశానికి ప్రధాని కావాలని అనుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ కాలికి బలపం కట్టుకుని దుమ్ము ధూళిలో చెట్టు పుట్టల వెంట అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మూర్తీభవించిన వైరాగ్య రూపం. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆయన పార్టీ అధ్యక్ష పదవిని వైరాగ్యంతోనే తిరస్కరించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు ప్రధాని పదవిని కూడా వైరాగ్యంతోనే వద్దనుకున్నారు. కాంగ్రెస్ ఓడిన తరువాత కూడా పార్టీ సారథ్య బాధ్యతలను అదే వైరాగ్య స్ఫూర్తితో వద్దనుకున్నారు. చివరికి పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమయింది. అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో జరిగినట్లు కాంగ్రెస్ అనుకుంటున్న ఈ ఎన్నికలో ఎనభై ఏళ్ల దక్షిణాది ఖర్గే అఖండ మెజారిటీతో గెలిచారు. ఆయన ఓడిపోతారని కాంగ్రెస్ ను ద్వేషించేవారు కూడా ఎవరూ అనుకోలేదు. అధ్యక్ష ఎన్నికలో ఏయే అక్రమాలు ఎలా జరిగాయో వివరిస్తూ పార్టీ ఎన్నికల అధికారికి శశి థరూర్ తన అసమాన భాషా పాటవంతో ఫిర్యాదు చేశారు. అయిపోయిన పెళ్లికి బాజాలు ఉండవు. ఉన్నా దండగ. ఎవరూ వినిపించుకోరు.

దక్షిణాది ఎస్ సి సామాజిక వ్యక్తికి అగ్ర స్థానం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఇవ్వదలుచుకున్న సందేశం వరకు…ఈ ఎన్నిక మంచిదే. ఆహ్వానించాల్సిందే. గాంధీయేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇచ్చారన్న పేరు తెచ్చుకుని…కుటుంబ పాలన ముద్ర చెరిపేసుకోవాలన్న ప్రయత్నం కూడా మంచిదే. అర్థం చేసుకోదగ్గదే.

అయితే- కాంగ్రెస్ స్వరూప, స్వభావాలు, విధి- విధానాలు, పనితీరు, గత చరిత్ర, గతంలో గాంధీయేతర అధ్యక్షులకు ఏపాటి గౌరవం, పనిచేసుకునే స్వేచ్ఛ ఇచ్చారన్న విషయాలు తెలిసినవారికి ఖర్గే ఎన్నిక ద్వారా అద్భుతాలు జరుగుతాయని అనిపించదు.

నరేంద్ర మోడీ రెండోసారి గెలిచి ప్రధాని అయిన కొత్తల్లో, కాంగ్రెస్ వరుసగా రెండు సార్లు ఓడిన కొత్తల్లో ఒక ఇంగ్లీషు జోక్ తెగ వైరల్ గా తిరిగింది. దాన్ని తెలుగులోకి అనువదిస్తే దాదాపు ఇలా ఉంటుంది:-

Karge

రెండోసారి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏ ఐ సి సి అధ్యక్షురాలు తనకు తాను ఇచ్చుకున్న రాజీనామాను…తనే తిరస్కరించడంతో…సాంకేతికంగా తనే మళ్లీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనని తనకు తానే చెప్పుకోవడం వల్ల…తాత్కాలిక అధ్యక్షురాలిగా అయినా ఉండాలని తనను తానే అభ్యర్థించారు. తనలో తాను అంతర్మథనం చేసుకున్నాక తనకు తానుగా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుని…తనంతట తాను తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉండడానికి దయతో అంగీకరించారు”.

ఇందులో నామవాచకం, సర్వనామాలను సరిగ్గా అన్వయించుకుని…అర్థం చేసుకునే బాధ్యత దేశ ప్రజల మీదే ఉంటుంది. ఆ అయోమయానికి కాంగ్రెస్ ది బాధ్యత కానే కాదు.

ఖర్గే ఎన్నిక కూడా ఇలాంటిదేనా? కాదా? అన్నది కాలమే చెబుతుంది.

ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప…వైరాగ్యం రాదు!
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారానికి మోడీ సిద్ధమవుతుంటే…
రాహుల్ మాత్రం వైరాగ్యానికే వైరాగ్య పాఠాలు చెబుతూ పార్టీని ఎటో తీసుకెళుతున్నారు.

Karge

ఎవరు భవిష్యత్తు ఉన్న నాయకులో గుర్తించి…వారికి భవిష్యత్తు లేకుండా చేయడంలో;
భవిష్యత్తు ఉన్నవారు పార్టీని వదిలిపెట్టి…ప్రత్యర్థి పార్టీలో చేరేలా ప్రోత్సహించడంలో;
ఎవరు భవిష్యత్తు లేని వృద్ధులో…వారిని గుర్తించి నెత్తిన పెట్టుకోవడంలో కాంగ్రెస్ కు ఏ పార్టీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. రాబోదు. రానే రాదు.

తటస్థుడు కాంగ్రెస్ ను అడిగే ప్రశ్న:-
కాంగ్రెస్ తానోడి…ప్రత్యర్థిని గెలిపిస్తోందా?
ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

పునరపి మరణం

Also Read :

సామాన్యుడి గోచీ విలువెంత?

RELATED ARTICLES

Most Popular

న్యూస్