Sunday, November 24, 2024
HomeTrending Newsఎవ్వరినీ వదిలిపెట్టం : బాబు హెచ్చరిక

ఎవ్వరినీ వదిలిపెట్టం : బాబు హెచ్చరిక

నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఓ బిసీ నేత  చింతకాయల అయ్యన్నపాత్రుడిని  ఇంత అవమానకరంగా అరెస్టు చేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. అర్ధరాత్రి దొంగల్లాగా వెళ్తారా అంటూ ప్రభుత్వంపై  మండిపడ్డారు.  రాష్ట్రంలో అరాచక పాలనకు ఈ అరెస్టు ఒక ఉదాహరణ అని అన్నారు. సిఐడికి హైకోర్టు చివాట్లు పెట్టినా ఇంకా తీరు మార్చుకోవడంలేదని, ఆ శాఖలో ఉన్నవారి చరిత్ర ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ పట్నంలోని భూకబ్జాలను, వైఎస్ వివేకా కేసులో షర్మిల వాంగ్మూలాన్ని పక్కదారి పట్టించేందుకే అయ్యన్నపాత్రుడిని  ఈరోజు అరెస్టు చేశారన్నారు.  అయ్యన్న పాత్రుడి కుంటుంబం పేదలకు భూమి దానంగా ఇచ్చిందని, అందుకే ఒక వూరికి  అయ్యన్నపాలెం అని పేరు కూడా పెట్టుకున్నారని చంద్రబాబు వివరించారు. కానీ పులివెందులలో 600 ఎకరాల అసైన్ మెంట్ ల్యాండ్ ఆక్రమించి తాము నిలదీస్తే  ఆ తర్వాత  వైఎస్ ఆ భూమిని ప్రభుత్వానికి సరెండర్ చేశారని గుర్తు చేశారు. అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని,  దీనికి పదిరెట్లు అనుభవిస్తారని హెచ్చరించారు. కానీ అయ్యన్న కేసులో కేవలం రెండు సెంట్లు మాత్రమే ఆక్రమించుకున్నట్లు తేలిందని, ఆ భూమి కూడా అయ్యన్న పేరుతో లేదని, అయ్యన్న భార్య విజయ, కుమారుడు రాజేష్ పేరిట భూమి పేర్లు ఆ నోటీసులో ఉంటే అయ్యన్నన్ను ఎలా ఏ1గా పెడతారని బాబు ప్రశ్నించారు.  70 సంవత్సరాల వయసున్న వ్యక్తి అయ్యన్నపై రేప్ కేసు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.  రేపు తమ ప్రభుత్వం వచ్చిన తరువాత వీరి సంగతి తేలుస్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అక్రమాలు చేసేవారు కూడా శిక్షార్హులేనని స్పష్టం చేశారు.

అధికారులు కూడా పైవాళ్ళు ఏమి చెబితే అది చేయకుండా ఆలోచించి నడచుకోవాలన్నారు. 175సీట్లు గెలవడం అటుంచి, ఎన్నికల తర్వాతా మీ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని జోస్యం చెప్పారు.  పవన్ ఇంటిపై కూడా రెక్కీ నిర్వహించారని, వీళ్ళకు నచ్చకపోతే ఎవరినైనా అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Also Read: అయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్