India tour of New Zealand, 2022: సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన మెరుపు ఇన్నింగ్స్ తో సత్తా చాటడంతో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 లో 65 పరుగులతో ఇండియా ఘన విజయం సాధించింది. సూర్య 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మౌంట్ మంగనూయీ లోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ -రిషభ్ పంత్ లు ఇన్నింగ్స్ ఆరంభించారు. జట్టు స్కోరు 36 వద్ద పంత్ (6) ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ పాండ్యా చెరో 13 పరుగులు చేశాడు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
కివీస్ బౌలర్లలో సౌతీ 3, ఫెర్గ్యుసన్ 2; ఇష్ సోదీ ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో కివీస్ స్కోరు మొదలు కాకముందే ఓపెనర్ ఫైన్ అల్లెన్ వికెట్ కోల్పోయింది. డెవాన్ కాన్వే కూడా 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే 61 పరుగులతో రాణించాడు. దీనితో కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగలకే ఆలౌట్ అయ్యింది.
ఇండియా బౌలర్లలో దీపక్ హుడా 4; మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్ చెరో 2; భువీ, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.
సూర్య కుమార్ యాదవ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఈ గెలుపుతో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి 20 ఎల్లుండి మంగళవారం నేపియర్ లో జరగనుంది.