వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల మళ్లీ ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రను తిరిగి డిసెంబర్ 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు షర్మిల తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని, వారంతా తన కుటుంబమని షర్మిల వ్యాఖ్యానించారు.
హైకోర్టు షరతులతో ఈ యాత్ర కొనసాగించే విధంగా షర్మిల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సంపేటలో సోమవారం ఉద్రిక్తతల నడుమ పాదయాత్రకు ఆటంకం కలిగింది. టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహించి పాదయాత్రను అడ్డుకోవడం, షర్మిల బస్సును తగులబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షర్మిల హైదరాబాద్ లో ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు దిగాలనుకునే ప్రయత్నం బెడిసికొట్టినా… తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
షర్మిల పాదయాత్రను నర్సంపేట పోలీసులు రద్దుచేశారు. దీంతో పాదయాత్ర ఇక కొనసాగడం కష్టమేననుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల తరఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో షరతులతో కూడిన అనుమతి లభించింది. ఎవ్వరినీ రెచ్చగొట్టకుండా, విద్వేషాలకు తావులేకుండా పాదయాత్ర చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.