Sunday, November 24, 2024
HomeTrending Newsవేమగిరి నర్సరీ పరిశోధన శాల అభివృద్ధి చేయండి: భరత్ వినతి 

వేమగిరి నర్సరీ పరిశోధన శాల అభివృద్ధి చేయండి: భరత్ వినతి 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం వేమగిరిలో నర్సరీ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లోరీ కల్చరల్ ప్రాంతీయ పరిశోధనా సంస్థ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ను వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఈ మేరకు న్యూ ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలుసుకుని వినతి పత్రం అందజేశారు. నర్సరీ రైతుల విజ్ఞప్తిపై కేంద్రప్రభుత్వం ఆధీనంలో గల డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరీకల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పూణే వేమగిరిలో ఫ్లోరీకల్చరల్ ప్రాంతీయ పరిశోధనా సంస్థను మంజూరు చేసిందని ఎంపీ భరత్ కు తెలిపారు. ప్రస్తుతం ఈ పరిశోధనా సంస్థలో అయిదుగురు శాస్త్తవేత్తలకు గాను ముగ్గురు మాత్రమే ఉండటంతో అనుకున్నంత మేర పరిశీలనా నివేదికలు త్వరితగతిన రాలేకపోతున్నాయని, కావున మిగిలిన సిబ్బందిని వెంటనే నియమించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ కోరారు.

అలాగే వేమగిరిలో ప్రాంతీయ పరిశోధనా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 10.77 ఎకరాల స్థలాన్ని అందజేసిందని, 2019 జూన్ 21న భవనం శంకుస్థాపన జరిగి, 2021 మే నెలలో ప్రాంతీయ పరిశోధనా సంస్థకు అప్పగించారన్నారు. అయితే పూర్తి స్థాయిలో భవనం నిర్మించవలసిన అవసరం ఉందని ఎంపీ భరత్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కడియం, ఆత్రేయపురం, ఆలమూరు, మండపేట మండలాల్లో సుమారు 11,500 హెక్టార్లలో నర్సరీలు విస్తరించి ఉన్నాయని, 300 రకాల అలంకార, పుష్ప జాతి మొక్కలను ఇక్కడ ఉత్పత్తి చేస్తుంటారని మంత్రికి ఎంపీ భరత్ వివరించారు.

సుమారు వంద సంవత్సరాల నుండి నర్సరీ నిర్వాహకులు తరతరాలుగా ఈ నర్సరీలనే నమ్ముకుని జీవిస్తున్నారని, వీరితోపాటు కూలీలు, కార్మికులు, వ్యాపారులు ఇలా సుమారు 50 వేల మంది ఆధారపడి ఉన్నారన్నారు. వీరందరికీ సంపూర్ణ శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం అందించాలని నర్సరీ రైతుల కోరిక మేరకు వేమగిరిలో ఫ్లోరీకల్చరల్ ప్రాంతీయ పరిశోధనా సంస్థను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఐసీఏఆర్ (పూణే) ఏర్పాటు చేసిందన్నారు. ఈ పరిశోధనా కార్యాలయ నూతన భవనానికి రూ.4 కోట్లు, అలాగే పూర్తి స్థాయి పరిశోధనలకు కావలసిన సామాగ్రి కొనుగోలుకు రూ.3.14కోట్లు అవసరం అవుతాయని, ఈ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ను ఎంపీ భరత్ కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్