గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కలిసి పనిచేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసియార్ లు ఇప్పుడెందుకు కలిసి మాట్లాడుకోవడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం జల విద్యుత్ చేస్తూ పులిచింతలలో నీళ్ళు వదిలిపెడుతుంటే జగన్ ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు.
నీటి విషయంలో ఎగువ రాష్ట్రాల నుంచి దిగువ రాష్ట్రాలకు కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, అయితే మన హక్కులను మనం కాపాడుకోవాల్సి ఉంటుందని బాబు చెప్పారు. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు గవర్నర్ వద్ద కలిసి మాట్లాడుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటిది లేకుండా సముద్రంలోకి నీరు వదిలిపెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఖజానా ఖాళీ, జగన్ ఖజానా గళ గళగా పరిస్థితి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెత్తపై కూడా పన్నులు వేసిన చెత్త ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. ఢిల్లీ మెడలు వంచుతామని, ఢిల్లీ ముందు మెడలు వంచారని బాబు ఎద్దేవా చేశారు. రైతుల పంటను కొని డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, డబ్బులు ఇవ్వమని అడిగితె రైతులపైనే ఎదురు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకుండా పోరాడతామని హెచ్చరించారు.
కరోనా నియంత్రణలో, ఆస్పత్రుల నిర్వహణ, మందులు, ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని, తమ హయాంలో పోలవరాన్ని పరుగెత్తించామని, ఇప్పుడు ఆ ప్రాజెక్టును పడుకోబెట్టారని, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.