Naturality:
కన్నెతనం వన్నె మాసి
ప్రౌఢత్వం పారిపోయి
మధ్యవయను తొంగిచూసిన
ముసలిరూపు ముంచుకు రాదా!
ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో చదివిన
ఫోటో కవిత. వయసు గురించి ఎప్పుడు విన్నా గుర్తుకు వస్తుంది. నిజమే, వయసు దాచేది కాదు. కానీ పెరిగిన జీవితకాలం, రకరకాల మేకప్ సాధనాలు కొంతవరకు వయసు దాచడానికి సహాయపడుతున్నాయి.
ఒకప్పుడు నాటకాలు, సినిమాలకే పరిమితమైన మేకప్ మన ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చింది. అందరూ వాడతారని కాదు కానీ యువతరం ఎక్కువే వాడుతోంది. నా చిన్నతనంలో స్కూల్ డాన్సులో మేకప్ మాత్రమే తెలుసు. తర్వాత్తర్వాత మాయిశ్చరైజర్, లిప్ గ్లాస్ పరిచయమయ్యాయి. చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకా వేగంగా మారింది. ఇప్పుడైతే మేకప్ వేసుకోకపోతే ఆధునికులు కారు. ఇక సినిమాలు, అందాల పోటీల్లో మేకప్ లేకుండా చూడగలమా!
అల్లా చూసే అవకాశం ఇప్పుడు కలిగింది. అదీ మేకప్ పుట్టినిల్లుగా చెప్పే దేశంలో. అరుదైన ఈ ఖ్యాతికి వేదికయ్యాయి ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన అందాల పోటీలు.
పెళ్ళిసంబంధాల సమయంలో అందంగా కనిపించి ఆనక అసలురూపం చూసి దడుసుకున్న వైనం అనేకం విన్నాం. కారణం మేకప్. ఎటువంటి వారినైనా మేకప్ తో మార్చేయచ్చు. ఇక అందాల పోటీలంటే మాటలా? అయితే ఈ పోటీల్లో పాల్గొడానికి అభ్యర్థులు పంపే ఫొటోల్లో సైతం విపరీతమైన మేకప్ తో ఉండటాన్ని గమనించారు నిర్వాహకురాలు ఆంజీ బీస్లే. దాంతో 2019 లో మేకప్ లేకుండా ఉండే ‘ బేర్ ఫేస్ రౌండ్’ మొదలుపెట్టారు. ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మహిళలు తమని తాము ఆవిష్కరించుకోవడం ఉద్దేశం . అయితే ఇందులో పోటీ పడటం స్వచ్చందం. దాంతో చాలామంది మొగ్గు చూపలేదు. ఇరవయ్యేళ్ళ మెలిస్సా రవుఫ్ ఇందుకు శ్రీకారం చుట్టి 94 ఏళ్ళ చరిత్రలో ఈ ఘనత సాధించిన యువతిగా చరిత్ర సృష్టించింది.
అసలైన అందం సింపుల్ గా ఉండడమేననే మెలిస్సా చిన్న వయసునుంచే మేకప్ వేసుకునేది. అయితే మేకప్ లేకుండా సహజంగా ఉండడమే నిజమైన సౌందర్యం అని ఆమెకు అనిపించింది. అందుకు అందాల పోటీలో పాల్గొనడం సరైన వేదిక అనుకుంది. ఫైనల్స్ వరకు అన్ని రౌండ్స్ నెగ్గింది. విజేత కాలేకపోయినా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఈమె స్ఫూర్తి తో మున్ముందు మరింతగా సహజ సౌందర్య పోటీలు చూడచ్చేమో! (కాస్మెటిక్ కంపెనీలు అడ్డు పడక పోతే)ఏమైనా మేకప్ తో ముడిపడ్డ అన్ని రంగాల్లో ఇటువంటి మార్పులు వస్తే మంచిదేగా!
-కె. శోభ
Also Read :
Also Read :
Also Read :