Sunday, November 24, 2024
HomeTrending Newsగవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం…గవర్నర్ ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.  తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్​తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. బిల్లులందక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం 16 వేల మిగులు బడ్జెట్​ ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే..అన్న విషయాన్ని మరిచిపోయిందన్నారు.

వ్యవసాయ సబ్సిడీలు, పథకాలన్నిటిని ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వం….రైతు బంధు ఇస్తున్నా వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో సమాధానం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధరణి’ రైతుల్ని దగా చేస్తుంటే తప్పులు సవరణపై స్పందించే నాధుడే లేడన్నారు. కేంద్రం నిధులతో నడుస్తున్న బస్తీ దవాఖానాలను తమ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటని, ఏడాదిలోపు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తుంటే…రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి దానిచుట్టూ వివాదాలను సృష్టిస్తు ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NTPC ద్వారా జరుగుతున్న విద్యుదుత్పత్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం కన్నా దివాళాకోరు ప్రకటన ఇంకోటి ఉండదన్నారు. ఇకనైనా అబద్ధాలను ప్రచారం చేయడం మాని రాష్ట్ర సంక్షేమంపై దృష్టిపెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – సిఎం కెసిఆర్ కు హితవు పలికారు.

Also Read : దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై 

RELATED ARTICLES

Most Popular

న్యూస్