భారత్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోపీ నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ నేడు నాగపూర్ లో ఆరంభమైంది. ఆంధ్రా ఆటగాడు కోన శ్రీకర్ భరత్ ఈ టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగ్రేటం చేశాడు. టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇండియా క్యాప్ ను భరత్ కు అందించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న భరత్ భావోద్వేగానికి లోనయ్యాడు.
భరత్ కు 2021లో స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్థానం లభించినా జట్టు సమీకరణాల నేపథ్యంలో అప్పట్లో మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. తొలిసారి నేడు క్యాప్ తో మైదానంలో అడుగు పెట్టాడు. దేశవాళీ క్రికెట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున భరత్ ఆడుతున్నారు.
భరత్ తో పాటు పొట్టి ఫార్మాట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతోన్న సూర్య కుమార్ యాదవ్ కూడా తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో ఇండియా బరిలోకి దిగింది.
జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్. మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్ లో ఒకే పరుగు రాగా రెండో ఓవర్ తొలి బంతికే మహమ్మద్ సిరాజ్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీగా ఔట్ చేశాడు. మూడో ఓవర్లో షమీ… డేవిడ్ వార్నర్ ను బౌల్డ్ చేశాడు. దీనితో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.