Sunday, November 24, 2024
Homeసినిమాకార్పొరేట్ విద్యా వ్యవస్థను సవాల్ చేసిన 'సార్'

కార్పొరేట్ విద్యా వ్యవస్థను సవాల్ చేసిన ‘సార్’

యూత్ ను థియేటర్స్ కి రప్పించాలంటే అది ప్రేమకథ అయ్యుండాలి. పెద్దలను ఎదిరించే ప్రేమకథల్లో మజా ఉంటుందనే వారి సంఖ్యనే ఎక్కువ. ఇక కాలేజ్ నేపథ్యంలో కథ అంటే కూడా అక్కడ కూడా ఏదో ఒక రూపంలో లవ్ ట్రాక్ నడవాల్సిందే. అలా కాకుండా లవ్ ట్రాక్ నాకూ ఉండకూడదు .. మీకూ ఉండకూడదన్నట్టుగా ఒక లెక్చరర్ రంగంలోకి దిగేసి, విద్య అనే విషయంపైనే కథను నడిపించాలంటే అందుకు కొంచెం ధైర్యం కావాలి.

అలా ధనుశ్ చేసిన ధైర్యం పేరే ‘సార్‘. ఈ కథలో హీరో నిజాయితీని .. ఆయన ఆశయ సాధనను చూసే హీరోయిన్ మనసు పారేసుకుంటుంది. తన ఆశయంపైనే తప్ప ఆమె ఆశలతో హీరోకి సంబంధం లేదు. ఒక లెక్చరర్ గా ముందు తన కెరియర్ ను గురించి ఆలోచన చేసిన హీరో, ఆ తరువాత స్టూడెంట్స్ కెరియర్ ముఖ్యమని భావిస్తాడు. ప్రైవేట్ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరచడానికి ఒక స్వార్థపరుడు ప్రయత్నిస్తాడు. సామాన్యుల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకుంటాడు. అతనిపై యుద్ధం ప్రకటించిన ఒక సార్ కథ ఇది.

ఈ కథకు స్మార్టు ఫోన్స్ లేని కాలం అవసరం. అందువలన దర్శకుడు వెంకీ అట్లూరి 1993కి తీసుకుని వెళతాడు. ఈ కథను ఆయన కాస్త సీరియస్ గానే నడిపించాడు. మెయిన్ పాయింట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అతను అల్లుకున్న ఈ కథలో యాక్షన్ .. ఎమోషన్ తప్ప మిగతా రసాలు ఇమడవు. విలేజ్ స్థాయిలో వెనుకబడిన పిల్లల కోసం హీరో పోరాడిన తీరు బాగానే ఉంది. కాకపోతే ఈ పోరాట ఫలితాన్ని ఏ వైపు నుంచి ఏ ఖాతాలో వేయాలనే విషయంలో దర్శకుడికి క్లారిటీ లోపించేదేమో అనిపిస్తుంది. ధనుశ్ .. సముద్రఖని నటన, జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. యూత్ రిసీవ్ చేసుకునే తీరుపైనే ఈ సినిమా రిజల్టు ఆధారపడి ఉంటుంది.

Also Read : ‘సార్’ కు ఇంత మంచి స్పందన రావడం గర్వంగా ఉంది వెంకీ అట్లూరి

RELATED ARTICLES

Most Popular

న్యూస్