మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలలో కాస్త ఎక్కువ యాక్టివ్ గా కనిపించేది సాయితేజ్ నే. కుర్రాడు డాన్సులు .. ఫైట్లు బాగా చేస్తున్నాడనే పేరును కెరియర్ మొదట్లోనే తెచ్చుకున్నాడు. ఇటు యూత్ కీ .. అటు మాస్ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. చరణ్ .. బన్నీ తరువాత స్థానంలో సాయితేజ్ నిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాలకు తగినట్టుగానే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సమయంలోనే ఆయన ప్రమాదం బారినపడ్డాడు.
ఆ ప్రమాదం నుంచి సాయితేజ్ పూర్తిగా కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు రావడానికి చాలా సమయం పట్టేసింది. ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘విరూపాక్ష‘. బీఏవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటు గ్రామీణ నేపథ్యం .. అటు ఫారెస్ట్, ఒక వైపున సైన్స్ .. మరో వైపున తాంత్రికం నేపథ్యంలో విజువల్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ సినిమాకి ముందు సాయితేజ్ సక్సెస్ గ్రాఫ్ అంత ఆశాజనకంగా లేదు. ‘చిత్రలహరి’ తరువాత ఆయనకి హిట్ పడలేదు. అందువలన ఇప్పుడు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టవలసిన అవసరం ఉంది. ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మతగా వ్యవహరించాడు గనుక, కథాకథనాల్లో బలం ఉండే ఉంటుంది. నిర్మాణ పరమైన విలువలను గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!