సామాన్యులపై వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో అధిక సేల్స్ చేసిన వారికి అవార్డ్స్ అందజేశారు కిషన్ రెడ్డి. ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జన ఔషధి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు కిషన్ రెడ్డి. తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకాన్ని కేంద్రం ప్రారంభించామన్నారు.
పేదలు, వెనుకబడిన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకు అందించడమే దీని లక్ష్యమన్నారు. మొదట్లో ఒక జిల్లా కేంద్రానికి కనీసం ఒక జన ఔషధి కేంద్రం ఉండాలని సంకల్పంతో ప్రారంభించి.. ఆ తర్వాత ఫ్రాంచైజీ మోడల్ ద్వారా వీటి సంఖ్యను విస్తృతంగా కేంద్రం పెంచిందన్నారు.
2017లో 3వేల జనఔషధి కేంద్రాలు ఉండగా.. మార్చి 2020 నాటికి ఈ సంఖ్య 6 వేలకు పెరిగింది. ఫిబ్రవరి 28, 2023 నాటికి దేశంలో 9 వేల 177 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. జన ఔషధి.. ‘సేవా భీ, రోజ్‌గార్ భీ’ నినాదంతో కేంద్రం ముందుకెళ్తోందన్నారు. ఈ కేంద్రాల నిర్వాహకులకు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు కేంద్రం పెంచిందన్నారు. అలాగే మహిళలు, దివ్యాంగులు, SC,STలు, వెనుకబడిన జిల్లాల్లో జన ఔషధి కేంద్రాలు ప్రారంభించే వారికి రూ.2లక్షల వన్-టైమ్ ఇన్సెంటివ్ కేంద్రం ఇస్తోందన్నారు కిషన్ రెడ్డి. మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనఔషధి కేంద్రాల్లో మందులు 50-90 శాతం తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తక్కువ ధరకే ఇస్తున్నా.. మందుల నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని కేంద్రమంత్రి తెలిపారు.
గుండె సంబంధిత, కేన్సర్, డయాబెటీస్, ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, గ్యాస్ట్రో వంటి వ్యాధులకు సంబంధించి 1,759 మందులు, 280 సర్జికల్ డివైజెస్ ఈ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు 2019లో ఒక రూపాయికే సానిటరీ నాప్కిన్ అందించే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారన్నారు. గత 8 ఏళ్లలో జన ఔషధి కేంద్రాలు, వీటి ద్వారా జరుగుతున్న ఔషధాల అమ్మకాల్లో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు కిషన్ రెడ్డి. 2014-15లో 80 దుకాణాలతో రూ.7.29 కోట్లు అమ్మకాలు జరిగితే.. ఇవాళ 2022-23 నాటికి 9,177 జనఔషధి కేంద్రాల ద్వారా దాదాపు రూ. 1,100 కోట్ల ఔషధాలు విక్రయిస్తున్నారన్నారు. అంటే ఈ ఎనిమిదేళ్లలో దుకాణాల సంఖ్య వంద రెట్లు, అమ్మకాలు వందరెట్ల కంటే ఎక్కువే పెరిగాయన్నారు.
గత ఎనిమిదేళ్లలో జన ఔషధి కేంద్రాల ద్వారా.. ఔషధాల కొనుగోళ్లకు సంబంధించి ప్రజలకు దాదాపు 20వేల కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. జన ఔషధి సుగమ్ అనే మొబైల్ యాప్ ద్వారా.. మనకు దగ్గర్లో ఎక్కడ ఈ కేంద్రాలున్నాయో, వాటిలో మందుల రేట్లు ఎంతో కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల్లో 1700లకు పైగా మెడిసిన్స్ ఇస్తున్నారు.. ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు.