మేకపాటి కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ తోనే ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ తాము పార్టీ మారుతున్నట్లు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి మొదటినుంచీ జగన్ తోనే ఉన్నారని, జగన్ నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ షర్మిల తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తన సోదరుడు గౌతమ్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారని… దురదృష్టవశాత్తూఅయన మరణిస్తే ఆ సీటు తనకు ఇచ్చి ఆదరించారని విక్రమ్ వివరించారు. ప్రజల్లో అపోహలు సృష్టించేదుకే ఇలాటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ విధానాలను ధిక్కరిస్తే ఎవరైనా చర్యలు ఎదుర్కొవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేంత వరకూ తనకు రాజకీయాలతో సంబంధం లేదని, కానీ జగన్ సూచించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ ఓ గొప్ప కార్యక్రమమని, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని, ఇప్పటికే తానూ 40వేల కుటుంబాలను కలిశానని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మనం గెలిస్తేనే ప్రజలకు మరింతగా సేవ చేయగాలుగుతున్నామని, అందుకే సిఎం జగన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను పిలిచి జాగ్రత్తలు చెబుతున్నారని మేకపాటి చెప్పారు.