Sunday, November 24, 2024
HomeTrending NewsPawan Kalyan: జూన్ 14నుంచి ప్రజల్లోకి ‘వారాహి’

Pawan Kalyan: జూన్ 14నుంచి ప్రజల్లోకి ‘వారాహి’

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి యాత్ర మొదలవుతుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులతో నాదెండ్ల ఈ ఉదయం నుంచి సమావేశం నిర్వహించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న తర్వాత యాత్రను పవన్ ప్రారంభిస్తారని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల మీదుగా తొలి విడత యాత్ర సాగుతుందని తెలిపారు.

ప్రతి అసెంబ్లీలో ఎక్కువ సమయం వెచ్చించేలా, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై అవగాహన వచ్చేలా ఈ కార్యక్రమాన్ని నాయకులతో కలిసి రూపొందించామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను తెలుసుకునేలా… పార్టీని బలోపేతం చేసేలా యాత్ర ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ఓ మార్పు కోసం, నిజాయతీగా ఓ మంచి పరిపాలన కోసం అహర్నిశలూ పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలకు ఓ భరోసా ఇస్తారని.. ఇది కేవలం ఒక ఎలక్షన్ ర్యాలీ లాగా, హడావుడి యాత్రలాగా, ఉపన్యాసాల కోసం రూపొందించిన యాత్ర కాదని స్పష్టం చేశారు. వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనమే ప్రధాన అజెండాగా ఉంటుందన్నారు.

వారాహి యాత్ర చరిత్ర సృష్టించేలా, ప్రజల్లో ధైర్యం నింపేలా, చైతన్యం తీసుకు వచ్చేలా.. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా తమ వంతు కృషి చేస్తామని, పార్టీ శ్రేణులు కూడా కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్